logo

డీసీసీబీలో ఆధిపత్య పోరు

డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

Published : 04 Jul 2024 06:13 IST

మహబూబ్‌నగర్‌లోని డీసీసీబీకి సంబంధించిన దుకాణ సముదాయం

ఈనాడు, మహబూబ్‌నగర్‌: డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అధికారులు చెప్పిన దానికి పాలకవర్గం కాదనడం, పాలకవర్గం నిర్ణయాలకు అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేయడం జరుగుతోంది. ఫలితంగా డీసీసీబీ పరిధిలో పలుచోట్ల అక్రమాలు జరిగినా చర్యలకు వెనకడుగు వేయాల్సి వస్తోంది. వనపర్తిలోని డీసీసీబీ పరిధిలో ఉన్న 22 దుకాణ సముదాయాల కాంప్లెక్స్‌పై అధికారులు, పాలకవర్గం మధ్య పెద్ద హైడ్రామా కొనసాగుతోంది. ఈ సముదాయాలను అద్దెకి ఇవ్వకూడదని నిబంధనలున్నాయి. కొందరు తెర వెనుక ఉండి కిరాయికి ఇచ్చి డబ్బు సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు, పాలకవర్గంలోని కొందరు డైరెక్టర్ల మధ్య అంతర్గత పోరు నడిచినట్లు సమాచారం. 

వనపర్తిలోని డీసీసీబీ కాంప్లెక్స్‌లో దుకాణాలు

ఖాళీ చేయాలని ఆదేశాలున్నా..

వనపర్తిలోని డీసీసీబీ దుకాణ సముదాయాలను ఖాళీ చేయించాలని ఎప్పటి నుంచో ఆదేశాలున్నాయి. ఖాళీ చేయించినట్లు లేఖలు సమర్పించినా అవి అలాగే కొనసాగాయి. ఇటీవలే ఈ సముదాయాలు ఖాళీ చేయించి కూల్చివేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీని ద్వారా ప్రతి నెల రూ.లక్షల్లో వచ్చే ఆదాయం కోల్పోతుండటంతో అధికార యంత్రాంగం, పాలకవర్గం మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ ఆదాయం మొత్తం ఒకవైపే వెళ్తుండటంతో దీనిపై ఒకరికొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ఏకంగా ఆర్‌బీఐకు కూడా లేఖ రాశారు. మరోవైపు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని డీసీసీబీ పేరు మీద పెద్ద దుకాణ సముదాయం ఉంది. తెలంగాణ చౌరస్తా సమీపంలోని ఈ సముదాయాల ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం డీసీసీబీ వీటిని ఖాళీ చేయించాలి. మొత్తం 30కుపైగా ఉన్న ఈ దుకాణాల ద్వారా వస్తున్న అద్దె ఎక్కడికి పోతుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు ఉచితంగానే వ్యాపారులు మడిగెల్లో ఉంటున్నారని పైకి చెబుతున్నా రూ.లక్షలు పలువురు జేబుల్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఈ విషయంలోనూ ఇరువర్గాల మధ్య పోరు నడిచినట్లు సమాచారం. గతంలోనూ నారాయణపేట సొసైటీ పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ పేరుతో జరిగిన అక్రమాల వ్యవహారం ఠాణా వరకు వెళ్లింది. ఇందులో అధికారులు క్రియాశీల పాత్ర వహించగా రాజకీయ నేతలు మాత్రం అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనూ విబేధాలు తారస్థాయికి చేరాయి. మహబూబ్‌నగర్‌ డీసీసీబీ కేంద్ర కార్యాలయం పరిధిలో మొత్తం 78 సంఘాలుండగా పలు సొసైటీల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. సొసైటీ పాలకవర్గంతోపాటు కొందరు నిధులను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఆడిట్‌ నిర్వహించి చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యత డీసీవోలు తీసుకుంటారు. పాలకవర్గం, డీసీవో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని డీసీసీబీ ఆరోపిస్తోంది. అక్రమాలు జరిగిన చోట డబ్బు రికవరీలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఈ అంతర్గత పోరుతో డీసీసీబీ మసకబారే పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే కార్యకలాపాలు గాడిలో పడటంతోపాటు అక్రమాలకు  అడ్డుకట్ట వేయవచ్చు.

 ఎక్కడైనా అక్రమాలు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం. నోటీసులు జారీ చేస్తున్నాం. వనపర్తి కాంప్లెక్స్‌ను ఖాళీ చేయాలని గతంలోనే నోటీసులిచ్చాం. మహబూబ్‌నగర్‌లోనూ కాంప్లెక్స్‌ ఉంది. అక్కడ దుకాణ సముదాయాలు ఉన్నప్పటికీ ఉచితంగా ఉంటున్నారు. కొందరు కోర్టుకు వెళ్లారు.

లక్ష్మయ్య, సీఈవో, డీసీసీబీ  మహబూబ్‌నగర్‌  కేంద్ర కార్యాలయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని