logo

వీసీ లేక.. సమస్యలు తీరక!

పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated : 04 Jul 2024 06:06 IST

పాలమూరు విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సహా కొత్త కోర్సులు ప్రారంభిస్తారని యువత భావించినా.. ఆశలు అడియాసలే అయ్యాయి. బోధనా సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నా.. కొత్తగా వారిని తీసుకునే పరిస్థితి లేదు.. ఉప కులపతి నియామకంపైనా స్పష్టత కొరవడింది. మే 21తో రెగ్యులర్‌ వీసీ పదవీ కాలం ముగియడంతో పీయూకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీంను ఇన్‌ఛార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. జూన్‌ 15వ తేదీ వరకు ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. గడువు ముగియడంతో వీసీ నియామకం జరిగే వరకు కొనసాగుతారని మరోసారి ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 10 వర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి సెర్చ్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇన్‌ఛార్జి వీసీ నియామకమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా వర్సిటీకి రాలేదు. వర్సిటీకి సంబంధించి వీసీ సంతకాలు, నిర్ణయాల కోసం అధికారులు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇన్‌ఛార్జి వీసీ పరిపాలనా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం లేకపోవటంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. రెగ్యులర్‌ రిజిస్ట్రార్‌ కూడా సెలవుల్లో ఉన్నారు. వీసీ ఉన్నప్పుడు క్యాంపస్‌లోని విద్యార్థుల రోజువారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేవారు. ఇప్పుడు ఊరడింపులు తప్ప సమస్యలు పరిష్కారం కావటం లేదు. పీయూ పరిధిలో వనపర్తి, జోగులాంబ గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సాధనకు న్యాక్‌లో మెరుగైన గుర్తింపు సాధించాలి. రెగ్యులర్‌ వీసీ లేకపోవటం వల్ల ఇందుకు కసరత్తు చేసే పరిస్థితి లేదు. బోధకులకు, పరిశోధకులకు మార్గదర్శనం లేక విద్యాబోధన వెనకబడింది. ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌) విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు అధ్యయన యాత్రలకు వెళ్లేందుకు వీసీ అనుమతి అవసరం. రెగ్యులర్‌ వీసీ లేక అధ్యయన యాత్రలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వీసీ లేకపోవటంతో బోధనేతర సిబ్బంది వేతన పెంపు పెండింగ్‌లో ఉండిపోయింది. వీసీ నియామకం ఎప్పటికి పూర్తవుతుందో అంతుపట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇబ్బందులు లేకుండా చర్యలు

కొన్ని సందర్భాల్లో అత్యవసరమైనప్పుడు హైదరాబాదుకు ఫైల్స్‌ తీసుకెళ్తే.. ఇన్‌ఛార్జి వీసీ వివరాలు అడిగి ఆమోదం తెలుపుతూ సంతకం చేస్తున్నారు. ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు బడ్జెట్‌ కేటాయింపు, భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర అన్ని రకాల అంశాల్లో వాట్సాప్‌ ద్వారా నివేదికలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. విద్యార్థుల సమస్యలు వేగంగా పరిష్కరిస్తున్నాం.

 డా.మధుసూదన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్, పీయూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని