logo

అర్హులైనా అందని పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్‌ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు.

Updated : 04 Jul 2024 06:11 IST

ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో లోపాలే శాపాలు
న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం

పథకాలు వర్తించక జడ్చర్ల పురపాలిక కార్యాలయంలో బారులు దీరిన బాధితులు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్‌ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. జడ్చర్ల పురపాలికలో నిర్వహించిన ప్రజాపాలన సభల్లో 14,863 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆదరబాదరగా నమోదు చేయటంతో చాలామంది లబ్ధిదారులుగా ఎంపిక కాలేదు. ఇలాంటి బాధితుల సంఖ్య భారీ సంఖ్యలో ఉంది. వారంతా పురపాలిక, విద్యుత్తు, గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. చివరకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి కొందరు నేరుగా కలుస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు ఇస్తున్నారు.

దరఖాస్తు చేసిన రసీదు ఉన్నా ఆన్‌లైన్‌లో నమోదు కాని దరఖాస్తు ఇదే

ప్రభుత్వం మరోమారు పొరపాట్ల సవరణకు, దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై పురపాలిక కమిషనర్‌ రాజయ్యని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఆలస్యంగా ఇవ్వటం, వివరాలు తప్పుగా ఉండటం వంటి కారణాలతో కొందరి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదన్నారు. నిత్యం చాలా మంది తన వద్దకు వస్తున్నారని, వారికి నచ్చజెప్పి పంపుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఈ పరిస్థితిని వివరించామని, తదుపరి ఉత్తర్వులు వస్తే పరిష్కరిస్తామన్నారు.


సిబ్బంది నిర్లక్ష్యంతో

ఈయన పేరు బి.జగదీశ్‌. జడ్చర్ల పట్టణం 20వ వార్డులో నివాసం ఉంటారు. జనవరి 3న ప్రజాపాలనలో భార్య లక్ష్మి పేరు మీద గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేశారు. పురపాలిక సిబ్బంది దరఖాస్తు తీసుకొని రసీదు ఇచ్చారు. పథకాలు అమలు కాకపోవడంతో నిత్యం పురపాలిక చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు సరిగ్గా లేదని అధికారులు చెప్పారు. మళ్లీ దరఖాస్తు చేస్తేనే పథకాలు వరిస్తాయని చెబుతున్నారని జగదీశ్‌ వాపోయారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ అధికారులను ఆరాతీయగా సిబ్బందే ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని తేలింది.


ఇంటి నంబరులో పొరపాటుతో..

ఈయన పేరు నరేందర్‌. బాదేపల్లి పాత బజారులోని 21వ వార్డులో నివాసం ఉంటున్నారు. తన భార్య, తల్లి పేర ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది ఆన్‌లైన్‌లో ఇంటి నంబరు తప్పుగా నమోదు చేయడంతో పథకాలు అమలు కాలేదు. విద్యుత్తు శాఖ, పురపాలిక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే తామేమి చేయలేమని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని