logo

మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు

ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు.

Published : 04 Jul 2024 04:35 IST

ఉపాధ్యాయుల కొరతతో నష్టపోతున్న విద్యార్థులు

సీనియర్లకు పదోన్నతి కల్పించాలని నాగర్‌కర్నూల్‌ డీఈవో గోవిందరాజులును కోరుతున్న ఉపాధ్యాయులు

అచ్చంపేట, న్యూస్‌టుడే : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పదోన్నతులు కల్పించడంతో ఖాళీలు మిగిలి పోయాయి. నేరుగా పదోన్నతుల ప్రక్రియను కొనసాగిస్తే ఈ సమస్య ఏర్పడేది కాదు. ఒక్కో ఉపాధ్యాయుడు వివిధ సబ్జెక్టుల్లో అదనపు విద్యార్హతలను సాధించడంతో వారికి రెండు, మూడు సబ్జెక్టుల్లో పదోన్నతి లభించింది. ఎన్ని సబ్జెక్టుల్లో పదోన్నతి లభించినా ఒకే స్థానంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఒక స్థానంలో చేరగా వారు పదోన్నతి పొందిన మిగతా స్థానాలు ఖాళీగా మిగిలిపోయాయి. సీనియర్‌ ఎస్జీటీలు అదనపు విద్యార్హతలతో ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో పదోన్నతి పొందడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. నేరుగా పదోన్నతుల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే వారు ఒకే స్థానాన్ని కోరుకోవడానికి అవకాశం ఉండేది. దాంతో సీనియార్టీ జాబితాల్లో తదుపరి ఉన్న ఉపాధ్యాయులకు మిగతా సబ్జెక్టుల్లో పదోన్నతి లభించేది. ఆన్‌లైన్‌ పదోన్నతులతో ఖాళీలు మిగిలి పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.

ఎక్కువ సబ్జెక్టుల్లో పద్నోతులు.. :  అచ్చంపేటకు చెందిన ఓ ఉపాధ్యాయుడికి పీఎస్‌ హెచ్‌ఎం, జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఎస్‌ఏగా పదోన్నతి లభించడంతో ఆయన ఒక స్థానంలో చేరగా మిగతా రెండు సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా మిగిలి పోయాయి. మరో ఉపాధ్యాయుడు జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా ఉంది. ఉప్పునుంతలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు పీఎస్‌ హెచ్‌ఎం, జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక పోస్టులో చేరగా మిగతా రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. మరో ఉపాధ్యాయుడు పీఎస్‌ హెచ్‌ఎం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో పదోన్నతి పొంది ఒక స్థానంలో చేరిన నాలుగు రోజులకే ఉద్యోగ విరమణ చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. ఉమ్మడి జిల్లాలో ఇలా చాలా ఎస్‌ఏ పోస్టులు మిగిలి పోవడంతో సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు.

మిగులు పోస్టులు ఇలా.. : ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్‌ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 51, వనపర్తి జిల్లాలో 49, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 42, నారాయణపేట జిల్లాలో 57, జోగులాంబ గద్వాల జిల్లాలో 64 ఎస్‌ఏ ఖాళీలు మిగిలి పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పీఎస్‌ హెచ్‌ఎం 21, ఎస్‌ఏ జీవశాస్త్రం నాలుగు, ఆంగ్లం 8, గణితం ఒకటి, భౌతికశాస్త్రం 5, సాంఘిక శాస్త్రం 12 వంతున ఖాళీలు మిగిలి పోయాయి. వనపర్తి జిల్లాలో పీఎస్‌ హెచ్‌ఎం 23, ఎస్‌ఏ ఆంగ్లం 9, భౌతికశాస్త్రం మూడు, జీవశాస్త్రం 4, గణితం మూడు, సాంఘికశాస్త్రంలో 7 ఖాళీలు భర్తీ కాలేదు. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది.

సీనియర్లతో భర్తీకి చర్యలు.. : మిగిలి పోయిన స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) సమాన స్థాయి ఖాళీలను సీనియార్టీ జాబితాల్లో తదుపరి సీనియర్‌ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పదోన్నతికి అవకాశం ఉన్న నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉపాధ్యాయులు డీఈవో గోవిందరాజులును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. పదోన్నతులు కల్పిస్తే వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా నేరుగా స్థానాలు కేటాయిస్తే ఖాళీలు మిగిలిపోయే అవకాశం ఉండదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని