logo

అనిశా వలలో తహసీల్దారు

పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్‌ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు.

Updated : 04 Jul 2024 06:08 IST

అనిశాకు పట్టుబడిన  గోపాల్‌పేట తహసీల్దారు

గోపాల్‌పేట, న్యూస్‌టుడే : పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్‌ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. సంఘటనకు సంబంధించి అనిశా డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని జింకలబీడు తండాకు చెందిన ముడావత్‌ పాండునాయక్‌ భార్య రాత్లావత్‌ సౌందర్య పేరున గ్రామ శివారులోని 120 సర్వే నంబరులో 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో 15 గుంటల భూమిలో కోళ్లఫారం నిర్మించేందుకు నిర్ణయించి, వ్యవసాయేతర (నాన్‌ అగ్రికల్చర్‌) భూమిగా మార్చుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 20వ తేదీన రూ.4,200 ప్రభుత్వానికి చలాన రూపంలో చెల్లించి, 21వ తేదీన గోపాల్‌పేట తహసీల్దారు శ్రీనివాసులును కలిశారు. భూమిని నాన్‌ అగ్రికల్చర్‌గా మార్చేందుకు ఆయన రూ.15 వేలు డిమాండు చేశారు. చివరకు రూ.8 వేలు ఇచ్చేందుకు రైతు అంగీకరించి, ఈ విషయాన్ని 26వ తేదీన అనిశా అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం బుధవారం సాయంత్రం బాధితుడు పాండునాయక్‌ కార్యాలయానికి వెళ్లి రూ.8 వేలు తహసీల్దారుకు ఇచ్చారు. అక్కడే కాపుకాసిన అనిశా అధికారులు తహసీల్దారు నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని పరీక్షలు నిర్వహించారు. డబ్బులపై ఆయన వేలిముద్రలు ఉండటంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని అనిశా డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ విలేకరులకు తెలిపారు. గోపాల్‌పేటలో ఆయన నివాసం ఉండే ఇంట్లో సోదాలు నిర్వహించామని చెప్పారు. ఆయనను అరెస్టు చేశామని, విచారణ పూర్తయిన తరువాత గురువారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. తహసీల్దారును అనిశా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిన వెంటనే ఆర్డీవో పద్మావతి గోపాల్‌పేట కార్యాలయానికి చేరుకుని, ఏసీబీ అధికారులను, కార్యాలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని