logo

బడిబాట ప్రవేశాలు నామమాత్రం

ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్‌ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్‌ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు.

Published : 04 Jul 2024 04:26 IST

నాగర్‌కర్నూల్‌ : ఊర్కొండ మండల కేంద్రంలో బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు (పాతచిత్రం)

కందనూలు, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్‌ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్‌ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జూన్‌ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బడిబాట కార్యక్రమం పక్కాగా నిర్వహించడానికి ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన తరువాత రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్‌ 8వ తేదీ నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ ప్రారంభించారు. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయులు తమ అనుకూలమైన ప్రాంతానికి బదిలీలు చేయించుకోవడానికి, పదోన్నతులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, అందుకు సంబంధించిన దరఖాస్తులను అందజేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగారు తప్పా గ్రామాలు, పట్టణాల్లో బడిబాట కార్యక్రమం ఆశించిన స్థాయిలో నిర్వహించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, అమ్మ ఆదర్శ మహిళ కమిటీ సభ్యులను, యువజన సంఘాల సభ్యులను భాగస్వాములు చేసి పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆచరణల్లో అమలు చేయలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 2,832 మంది విద్యార్థులు మాత్రమే ఒకటో తరగతి ప్రవేశాలు నమోదు చేసుకున్నారంటే బడిబాట కార్యక్రమం నామమాత్రంగా నిర్వహించినట్లు స్పష్టం అవుతుంది.

ఇప్పటికీ 2,832 మంది చేరిక..

జిల్లాలో మొత్తం 848 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 2023-24 విద్యా సంవత్సరంలో 5,898 మంది విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ఇప్పటి వరకు 2,832 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. గతేడాది నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో పోల్చితే ప్రస్తుత సంవత్సరంలో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని అచ్చంపేట మండలంలో 528, అమ్రాబాద్‌ 123, బల్మూరు 59, బిజినేపల్లి 276, చారకొండ 40, కల్వకుర్తి 60, కోడేర్‌ 125, కొల్లాపూర్‌ 158, లింగాల 80, నాగర్‌కర్నూల్‌ 380, పదర 50, పెద్దకొత్తపల్లి 126, పెంట్లవెల్లి 60, తాడూరు 121, వెల్దండ 102, ఊర్కొండ 25, వంగూరు 80 మంది విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించకపోవడం వలన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించినట్లు అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.

నమోదు చేసుకోవచ్చు..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ డిసెంబర్‌ వరకు కొనసాగుతుంది. సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రవేశాలు ఇంకా పెరుగుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. 

వెంకటయ్య, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్‌ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు

https://assets.eenadu.net/eeimages//featureimages/365X255/124124709-365X255.jpg మరిన్ని