logo

ఇంతింతై.. పెసరింతై

పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు.

Updated : 04 Jul 2024 06:10 IST

గత ఏడాదితో పోలిస్తే నూరుశాతం పెరిగిన సాగు
న్యూస్‌టుడే-దామరగిద్ద

దామరగిద్దలో సాగు చేసిన పెసరపైరు

పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. తర్వాత స్థానంలో నారాయణపేట, మద్దూరు మండలాలు ఉన్నాయి. 

ఇన్నాళ్లూ ఎందుకు తగ్గింది? : గతంలో జిల్లాలో 50వేల ఎకరాలకుపైగా సాగయ్యే పెసర 2వేల ఎకరాలకు పడిపోడానికి పలుకారణాలు ఉన్నాయి. గతంలో పెసర పైరుకు విపరీతమెనi తెగుళ్లు వచ్చాయి. పసుపు పచ్చతెగులుతో ఆకులు రంగుమారి పూత, కాత లేకపోయింది. బూడిద, జీడి తెగుళ్లు పెట్టుబడి రాని పరిస్థితిని తెచ్చాయి. చాలా ఏళ్లు పూతదశలో వర్షాలు ముఖం చాటేసేవి. పంటచేతికి అందే సమయంలో ఎక్కువవర్షాలు పడి గింజలు మొలకెత్తేవి. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది.

మద్దూరులో పచ్చజొన్న పంట

ఇప్పుడిలా...

  •  పెసరసాగు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా పంటవేసిన 70 రోజుల్లో చేతికి రావడంతో రెండో పంటగా వేరుసెనగ, వరి, ఇతర పంటల సాగుకు మంచి అనుకూలం. పెసర సాగు చేసిన పొలం సారవంతంగా ఉటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
  • కందిలోనూ అంతరపంటగా వేసుకునే అవకాశం ఉంది. పెసర కోత తర్వాత చాళ్ల మధ్యలో గుంటకతో పొలాన్ని చదును చేస్తే కంది దిగుబడికి అనుకూలం.
  • తెగుళ్ల బెడద రానురానూ తగ్గుతూ రావడం, ఎకరాకు కనీసం 4 క్వింటాళ్ల దిగుబడి కనిపించడంతో ఈ రెండేళ్లు రైతుల మోములో ఆనందం కనిపించింది.
  • గత ఏడాది నారాయణపేట మార్కెట్‌లో క్వింటాకు రూ.9,500 నుంచి రూ.10,500 ధర పలికింది. ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి పోనూ రైతుకు రూ.30వేలు మిగిలాయి. ఈసారి కూడా వాతావరణం అన్ని విధాలుగా అనుకూలిస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. మిగతా పంటకంటే ఈ పైరుకు పెట్టుబడి తక్కువే. ఈ కారణాలతో రైతులు మొగ్గు చూపుతున్నారు.

పచ్చ జొన్న సైతం.. : జిల్లాలో మద్దూరు, దామరగిద్ద, కోస్గి తదితర మండలాల్లో పచ్చజొన్నపై రైతులు మొగ్గు చూపుతారు. గత ఏడాది 4500 ఎకరాల్లో పచ్చజొన్న సాగుచేసి రైతులు లబ్ధిపొందారు. దీంతో ఈ ఏడాది ఈ పైరు రెట్టింపు సాగు చేశారు. ఈ ఏడాది మిగతా మండలాలకూ పచ్చజొన్న విస్తరించింది. ఈపైరుకు పెట్టుబడి చాలా తక్కువ. గత ఏడాది మార్కెట్‌లో క్వింటాకు రూ.9వేలకు పైగా ధర పలకడంతో ఈసారి రైతులు ఉత్సాహం చూపారు. పచ్చజొన్నలకు మార్కెట్‌లో అధికంగా ధర రావడానికి బీపీ, చక్కెర వ్యాధిగ్రస్తులు వీటిని విరివిగా వినియోగించడమే కారణం.

డిమాండ్‌.. ఆరోగ్య స్పృహ

పాలమూరు అంటేనే పప్పులు, చిరుధాన్యాలకు పెట్టింది పేరు. ఇతర పంటలపై మొగ్గు, ధర లేకపోవడంతో అవి తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో మళ్లీ వీటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్‌ వచ్చింది. అందుకు అనుగుణంగా రైతులు పంటల సాగు పెంచారు.

జాన్‌ సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి, నారాయణపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని