logo

నిద్దరోతున్న నిఘా కళ్లు

జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి.

Published : 04 Jul 2024 04:20 IST

కేజీబీవీల్లో భద్రత కరవు
న్యూస్‌టుడే- నారాయణపేట న్యూటౌన్‌

ధన్వాడ కేజీబీవీలో సీˆసీˆ కెమెరాలు పనిచేయకపోవడంతో వృథాగా పరిశీలన తెర

జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. వీటిని మేల్కొలిపి పని చేయించాల్సిన అధికారులు ఆ దిశగా కృషి చేయకపోతుండటంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 11 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో చదువుకుంటున్న వారందరూ విద్యార్థినులు కావడం, వీటిని గ్రామానికి దూరాన పొలాల మధ్యన నిర్మించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రహరీలు నిర్మించడమే కాకుండా సీˆసీˆ కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాల మూలంగా విద్యార్థుల భద్రతకు ఢోకా లేకుండా పోయింది. విద్యాలయానికి సంబంధించిన సామగ్రి దుర్వినియోగం కాకుండా, ఉపాధ్యాయులు సైతం వేళలకు హజరయ్యేలా ఉపకరిస్తాయని భావించారు. కొన్నాళ్ల పాటు కెమెరాలు బాగానే పని చేశాయి. ఆ తర్వాత ఏమైందో తెలియడంలేదు గాని అన్ని చోట్ల పడకేశాయి.

పట్టించుకోని అధికారులు : కెమెరాలు పనిచేయని విషయాన్ని గత ఏడాది నిర్వాహకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరు దృష్టికి ఈ విషయం చేరడంతో బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత వేసవి సెలవులు రావడంతో పట్టించుకోలేదు. హామీ ఇచ్చిన కలెక్టర్‌ బదిలీపై వెళ్లారు. దీంతో ఇంతవరకు వీటి మరమ్మతు కాలేదు. ప్రస్తుతం విద్యాలయాల్లో ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయి. గత నెల 27న ధన్వాడ కేజీబీవీని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి సందర్శించారు. సీˆసీˆ కెమెరాలు పని చేయని విషయాన్ని గుర్తించారు. సొంత నిధులైనా వెచ్చించి సీˆసీˆ కెమెరాలను మరమ్మతు చేయిస్తానని చెప్పారు. మండలాధికారులు వీటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే పర్యటన ముగిసి వారం రోజులు దాటింది. కాని ఇంతవరకు సీˆసీˆ కెమెరాల మరమ్మతులతో పాటు ఇతర పనుల పరంగా ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం సీˆసీˆ కెమెరాలు లేని కారణంగా పాలన, విధుల్లో పారదర్శకత లోపించింది. నిర్వాహకుల్లోనూ ఆందోళన నెలకొంది. దీని గుర్తించి ఇకనైన సీˆసీˆ కెమెరాల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఉన్నా లేనట్టుగానే.. : ప్రభుత్వం విద్యార్థినులకు వేడి నీళ్ల కోసం సోలార్‌ డ్రమ్ము ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇంటర్‌ ఉన్న కేజీబీవీలో 360 నుంచి 400 మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఇంటర్‌ లేని చోట 200 నుంచి 250 మంది ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రమ్ము వందమందికి వేడి నీళ్లను అందించలేకపోతోంది. గత కొన్ని రోజులుగా ఎండలు లేకపోతుండటంతో వేడినీళ్లే తయారు కావడంలేదు. వర్షాకాలం, శీతాకాలంలో వేడి నీళ్లు అవసరం పడుతాయి. అవసరం లేని ఎండాకాలంలో లభ్యమవుతున్నాయి. పెరిగిన విద్యార్థినుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని పెద్ద సోలార్‌ డ్రమ్ములను ఏర్పాటు చేయడమే కాకుండా సోలార్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు మరిన్ని ఫలకలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీˆ ఎన్నికలు రావడంతో అప్పట్లో మరమ్మతు సాధ్యపడలేదు. సోలార్‌ డ్రమ్ముల సామర్థ్యం పెంపు విషయాన్ని విద్యార్థినుల కోరిక మేరకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం జిల్లా అధికారుల దృష్టికి సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాను.

 పద్మనళిని జీసీˆడీవో, నారాయణపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు