logo

నీటి విడుదలలో స్పష్టత కరవు

ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

Published : 04 Jul 2024 04:16 IST

నారుమళ్లు సిద్ధం చేసుకోలేని దైన్యం

నిండుగా పారుతున్న భీమా సమాంతర కాలువ

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్‌లో పంటల సాగుకు ఆయకట్టు రైతులు సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో నీటి విడుదలపై స్పష్టత కరువైంది. రబీలో ఆయకట్టు కింద పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాలం ఇప్పటికీ సాగునీటి విడుదలపై నిర్ధిష్ట కార్యాచరణ ఖరారు కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సంప్రదాయం మేరకు ఏటా జూరాల ఆయకట్టు రైతులు ఆరుద్ర కార్తెలో వరిసాగుకు నారుపోసుకుంటారు. ఖరీఫ్‌లో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద పంట సాగుకు రైతులు సన్నద్ధంగా ఉన్నా నీటిపారుదల శాఖ అధికారులు నారుమళ్లకు సాగునీటిని విడుదల చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 వర్షాకాలనికి ముందు జూరాల ప్రాజెక్టు దాదాపుగా అడుగంటింది. నెల రోజుల్లో రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు జూరాలకు ప్రాజెక్టుకు వర్షపునీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో జూన్‌ నాలుగో తేదీ నుంచి వర్షపునీరు వచ్చి చేరడం ప్రారంభమైంది. జూన్‌ 15న గరిష్ఠంగా 9,657 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో కేవలం 75 క్యూసెక్కులకే పరిమితమైంది. ప్రాజెక్టుకు వర్షపునీరు వచ్చి చేరడం ప్రారంభమైన వెంటనే ప్రాజెక్టు నిలువనీటిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలించుకుపోయేందుకు ఉత్సాహం చూపిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు వాస్తవ ఆయకట్టు కింద నారుమళ్లను సిద్ధం చేసుకునేందుకు నీటిని విడుదల చేయకుండా వ్యవహరించారు.

ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి పరిస్థితి

జూరాల ప్రాజెక్టు వద్ద ఎఫ్‌ఆర్‌ఎల్‌ (గరిష్ఠ నిల్వ నీటి మట్టం) 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 7.645 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 3.938 టీంఎసీల నీటిని మాత్రమే సాగునీటి అవసరాలకు వినియోగించే పరిస్థితి నెలకొంది. పీజేపీ అధికారులు ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారు. కుడి కాలువ పరిధిలో రూ.36 లక్షలతో చేపట్టిన కాలువ మరమ్మతు పనులు పూర్తికాకపోవడం వల్ల నీటిని విడుదల చేయలేకపోతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రధాన ఎడమ కాలువలో ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకున్నా నీటిని విడుదల చేయకుండా వ్యవహరిస్తున్నారు. మంగళవారం వరకు కోయిల్‌సాగర్‌ పథకానికి 315, సమాంతర కాలువకు 800, భీమా రెండో దశకు 844 క్యూసెక్కుల నీటి విడుదల మాత్రం కొనసాగించారు.

ఆందోళనలకు సిద్ధం..

జూరాల వాస్తవ ఆయకట్టుకు కాకుండా ఎత్తిపోతల పథకాలకు నిల్వ నీటితో పాటు వచ్చి చేరిన వర్షపునీరు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పీజేపీ అధికారులు ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వెంటనే నారుమళ్లను సిద్ధం చేసుకునేందుకు నీరు విడుదల చేయాలి. వెంటనే ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి ఖరీఫ్‌ పంటకాలం ప్రణాళిక ఖరారు చేయాలి.

 విష్ణువర్ధన్‌రెడ్డి, మూలమల్ల, ఆత్మకూరు మండలం

త్వరలో సలహామండలి సమావేశం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నాం. ప్రాజెక్టులోకి వర్షపునీటి ప్రవాహం తగ్గడంతో నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పథకాలకు నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించాం. ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగిన వెంటనే ఆయకట్టు కింద నారుమళ్లకు సాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

 సత్యశీలారెడ్డి, ఎస్‌ఈ,  నీరుపారుదల శాఖ, వనపర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని