logo

విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం

వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్‌బాల్‌లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు.

Updated : 04 Jul 2024 06:11 IST

శిక్షణ శిబిరానికి హాజరైన భారత్‌ నెట్‌బాల్‌
జట్టు క్రీడాకారిణుల మనోగతం

జట్టు క్రీడాకారిణుల మనోగతం 

వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్‌బాల్‌లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. త్వరలో సౌదీ అరేబియాలో నిర్వహించే ఆసియా నెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే భారత మహిళా జట్టుకు ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది.

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ క్రీడలు

పీఈటీ శిక్షణతోనే ఈస్థాయికి..

సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో చదువుకునే రోజుల్లో పీఈటీ శిరీష నెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించటం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చా. తల్లిదండ్రులు కూడా వెన్నుతట్టారు. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్నా. క్రమం తప్పకుండా సాధన చేస్తూ జట్టులో గోల్‌ అటాకర్‌గా రాణిస్తున్నా. జార్ఖండ్, తెలంగాణ, హరియాణాలో జరిగిన జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నా. భారత జట్టుకు ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. ఈసారి అది నెరవేరడం ఎంతో గర్వకారణంగా ఉంది.

 జి.అక్షయ, రంగారెడ్డి జిల్లా

సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన నాన్న ప్రోత్సాహంతో నాలుగేళ్లుగా హైదరాబాద్, మేడ్చల్‌ నెట్‌బాల్‌ జట్ల తరఫున ఆడుతున్నా. గోవా, తెలంగాణ, మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయి సౌత్‌జోన్‌ టోర్నీలో నా ఆట తీరు అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగేలా దోహదపడింది. గోల్‌ షూటర్‌గా రాణించడంతో ప్రాబబుల్స్‌ శిక్షణ శిబిరంలో చోటు దక్కింది. భారత మహిళా జట్టుకు ఎంపికై నాన్న ఆశయం నెరవేరుస్తా. క్రీడా కోటాలో పోలీసు కావాలన్నదే ధ్యేయం.

యశశ్రీ, హైదరాబాద్‌నాన్న వెన్నుతట్టారు..

రెండోసారి ఆసియా టోర్నీకి

మాది హరియాణాలోని సోనిపథ్‌ జిల్లా. మా ఊళ్లో ప్రతి ఇంట్లో ఒకరు నెట్‌బాల్‌ ఆడతారు. నా ఎత్తు 5.9 అడుగులు కావటంతో పాఠశాల పీఈటీ ప్రోత్సహించారు. 13 జాతీయ స్థాయి టోర్నీలు ఆడా. అన్ని టోర్నీల్లో హరియాణా జట్టుకు బంగారు పతకాలే వచ్చాయి. 2023 సౌత్‌ కొరియాలో నిర్వహించిన ఆసియా యూత్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో భారత జట్టుకు ఎంపికై నాయకత్వం వహించా. రెండోసారి అంతర్జాతీయ టోర్నీకి ఎంపికవడం ఆనందంగా ఉంది. స్వర్ణం సాధించటమే లక్ష్యంగా సాధన చేస్తున్నా.

 పలక్, హరియాణా

బాబాయి ప్రోత్సాహంతో క్రీడల వైపు..

క్రీడాకారుడైన బాబాయి ప్రోత్సాహంతో పలు అంతర్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో పాల్గొన్నాను. పాఠశాలలో కోచ్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించటంతో నెట్‌బాల్‌పై దృష్టిసారించాను. నాలుగేళ్లుగా జట్టులో జీడీ స్థానంలో రాణిస్తున్నా. గోవా, తెలంగాణ, దిల్లీ, హరియాణా, కోల్‌కతాలో నిర్వహించిన అయిదు జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నా. మహబూబ్‌నగర్‌లో జరిగిన సౌత్‌జోన్‌ పోటీల్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించగా నేను భారత ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపికయ్యా. తొలిసారిగా భారత జట్టుకు ఆడే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. స్వర్ణ పతకం సాధించేందుకు కృషిచేస్తా. క్రీడా కోటాలో పోలీసు అధికారి కావాలన్నదే నా లక్ష్యం.

 జి.లితీష, మేడ్చల్‌ మల్కాజిగిరి

గర్వించేలా ఎదగాలని..

దిల్లీలోని మోడ్రన్‌ స్కూల్‌ పీఈటీ సైనీ నన్ను నెట్‌బాల్‌లో ప్రోత్సహించారు. అమ్మానాన్నలు వెన్నుతట్టారు. 12 జాతీయ స్థాయి టోర్నీలు ఆడాను. రెండు టోర్నీల్లో స్వర్ణ పతకాలు అందుకున్నా. 2023లో తొలిసారిగా భారత జట్టుకు ఎంపికై దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా నెట్‌బాల్‌ యూత్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నా. జట్టులో సెంటర్‌ స్థానంలో రాణించటంతో మరోసారి భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం దక్కింది. స్వర్ణం సాధనే లక్ష్యం. భారత్‌ గర్వించే క్రీడాకారిణిగా పేరు సంపాదించటమే ధ్యేయం. 

 గీతాంజలి, దిల్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని