logo

ఆవిష్కర్తలారా.. మీకోసం

ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 04 Jul 2024 06:11 IST

ఇంటింటా ఇన్నోవేటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల న్యూటౌన్, న్యూస్‌టుడే : ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇన్నోవేషన్‌ విభాగం ఆధ్వర్యంలో అయిదేళ్లుగా ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తోంది. ఏటా జులైలో దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టులో విజేతలను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరానికి విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మెకానిక్‌లు, వ్యవసాయదారులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. క్షేత్ర స్థాయిలో అవగాహన లేకపోవడంతో గతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిభ చాటిన వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. జోగులాంబ గద్వాల జిల్లానే తీసుకుంటే మూడేళ్లలో కేవలం 13 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాట్సప్‌ ద్వారానే..

ఆసక్తి ఉన్న వారు ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసిన ప్రాజెక్టులను పంపించడంలో ఇబ్బంది లేకుండా.. సులభంగా పంపించే సౌలభ్యం కల్పించారు. వివరాలను 91006 78543 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణ పేరు, దాని గురించి వివరిస్తూ.. వంద పదాలలో రాసి పంపాలి. అలాగే రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, చరవాణి నంబర్, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు వివరాలను వాట్సప్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆగస్టు 3వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు.

ఎంపికైతే.. : దరఖాస్తు చేసిన ఆవిష్కరణల్లో నేటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఉన్న వాటిని ఇన్నోవేషన్‌ విభాగంగా ఎంపిక చేస్తుంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన వారికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. కొత్త ఆవిష్కరణలు మెదడులో మెదలుతున్న వారు ప్రతిభను చాటేందుకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, దీనిపై అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చూస్తామని జిల్లా సైన్సు అధికారి భాస్కర్‌ పాపన్న తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని