logo

పీయూలో అక్రమ తవ్వకాలు

పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) క్యాంపస్‌లో అనేక అవసరాలకు ఉపయోగపడే స్థలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారు. పచ్చదనంతో కళకళలాడాల్సిన ప్రాంతాన్ని గోతులమయంగా మార్చి సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరుతో మొరం తరలించారు.

Published : 03 Jul 2024 04:40 IST

సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి భారీగా మొరం తరలించిన గుత్తేదారు 
న్యూస్‌టుడే, పాలమూరు విశ్వవిద్యాలయం 

పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) క్యాంపస్‌లో అనేక అవసరాలకు ఉపయోగపడే స్థలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారు. పచ్చదనంతో కళకళలాడాల్సిన ప్రాంతాన్ని గోతులమయంగా మార్చి సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరుతో మొరం తరలించారు. ఈ మొరం తవ్వకాలకు పీయూ ఉపకులపతి, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండిపోయారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీయూలోని పలు విభాగాలను ఎన్నికల అధికారులు ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్‌ రూంలకు వినియోగించుకున్నారు.

ఆయా విభాగాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు అటువైపు ఇతరులను అనుమతించలేదు. ఇదే అవకాశంగా గుత్తేదారులు అభివృద్ధి పనుల మాటున అక్రమాలకు తెరలేపారు. వర్సిటీ ఫార్మసీ విభాగం వెనక మైదానంలో రూ.8కోట్ల నిధులతో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాక్‌ చదును తదితర పనులకు ఇతర ప్రాంతాల నుంచే మొరం తీసుకురావాలి. గుత్తేదారు మాత్రం పీయూ క్రీడా విభాగం వెనక వైపు కొద్ది దూరంలో ఉన్న గుట్ట ప్రాంతాన్ని ఎకరం మేర విస్తీర్ణంలో పొక్లెయిన్లను ఉపయోగిస్తూ లోతుగా మొరం తవ్వకాలు చేపట్టారు. టిప్పర్ల, ట్రాక్టర్లతో రవాణా చేశారు. పీయూలో పచ్చదనం పెంచాల్సి ఉండగా మొరం తవ్వకాలతో  చాలా చెట్లు, మొక్కలను తొలగించారు. ఇదంతా కనిపిస్తున్నా పీయూ అధికారులు పట్టించుకోలేదు. 


విచారణ చేపడతాం

- డా.మధుసూదన్‌రెడ్డి, పీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌  

మొరం తవ్వకాలపై సమగ్ర విచారణ చేపడతాం. ఎంబీ రికార్డులను పరిశీలించి సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణంలో వినియోగించిన మొరం విలువ మినహాయించి బిల్లులు చెల్లిస్తాం. మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతను సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని