logo

బాల శాస్త్రవేత్తలకు ఆహ్వానం

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో శాస్త్రీయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకత ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ప్రధాన లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ చర్యలు చేపట్టింది.

Updated : 03 Jul 2024 05:12 IST

ఇన్‌స్పైర్‌ మనక్‌ నామినేషన్ల నమోదు
న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం, గద్వాల న్యూటౌన్‌

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో శాస్త్రీయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకత ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ప్రధాన లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డు(2024-25)కు సంబంధించి విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ నామినేషన్లు ఆహ్వానిస్తోంది. 

నెల 1 నుంచి సెప్టెంబరు 15 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి పాఠశాల నుంచి గైడ్‌ టీచర్‌తో కలిసి విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంటుంది. గత విద్యా సంవత్సరంలో ఇన్‌స్పైర్‌ మనక్‌లో ఉమ్మడి జిల్లా నుంచి 650 పాఠశాల విద్యార్థులు నమోదు చేసుకోగా 258 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఒక్కొక్క విద్యార్థి బ్యాంకు ఖాతాలో రూ. 10 వేలు జమ చేశారు. ప్రాజెక్టులను తయారు చేసి పాల్గొన్నవారిలో ఉత్తమమైన 18 ప్రదర్శనలను న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వీటిలో జాతీయ స్థాయికి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. నారాయణపేట జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు, నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి ఒకటి, వనపర్తి జిల్లా ఒక ప్రాజెక్టు ఎంపికయ్యాయి. 

ప్రాజెక్టుల తయారీకి రూ. 10 వేలు 

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ అవార్డును ఇస్తున్నాయి. ఎంపికైన విద్యార్థులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పోటీ పడతాయి. ఆ తరువాత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రదర్శనలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. సామాజిక అవసరాలు తీర్చగల సామర్థ్యం ఉన్న అలోచనలపై దృష్టి సారించి ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. 

 అర్హులు ఎవరంటే.. : ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాలు, ఆదర్శ, కేజీబీవీ, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి రెండు లేదా మూడు ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఐదు ప్రాజెక్టుల ఆలోచనలు పంపించాలి. ఉత్తమ ఆలోచనలు ఎంపిక చేసిన వెబ్‌సైట్‌లో  నమోదు చేస్తారు.

ఉమ్మడి జిల్లాలో ఎంపికలు ఇలా..

మ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 3250కిపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సుమారు వెయ్యి మంది విద్యార్థులకు పైగా దరఖాస్తు చేశారు. వీటిలో 520 ప్రదర్శనలు జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి 41 ప్రదర్శనలు ఎంపికయ్యాయి. వీటిలో 6 జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికవగా, భారత రాష్ట్రపతి ఎదుట ఇద్దరికి ప్రదర్శన చేసే అవకాశం లభించడం విశేషం. 2021-22లో 1,540కి పైగా దరఖాస్తులు చేస్తే.. జిల్లా స్థాయికి 510 ఎంపికవగా, రాష్ట్ర స్థాయికి ఎంపికైంది 12 మాత్రమే. ఇక 2022-23లో జిల్లా స్థాయికి 265, రాష్ట్ర స్థాయికి 18 ఎంపికవగా, ఇటీవల 4 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 2023-24లో జిల్లా స్థాయికి 258 ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయి ఎంపికలు జరగాల్సి ఉంది.

ప్రతి పాఠశాల నుంచి పాల్గొనాలి..

- భానుప్రకాశ్, జిల్లా సైన్స్‌ అధికారి, నారాయణపేట  

తరగతి గదిలో చదువుతున్న సమయం నుంచే విద్యార్థులలో శాస్త్రీయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకత పెంపొందించే వేదిక ఇది. ప్రతి పాఠశాల నుంచి పాల్గొనాలి. ఈ ఏడాది ఎక్కువ అవార్డులు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని