logo

ఎట్టకేలకు చెంచులకు ఓటు హక్కు

చెంచు మహిళ ఈశ్వరమ్మపై అమానుష దాడి.. మరో గిరిజనుడి మృతి, జాతీయ ఎస్టీ కమిషన్‌ నల్లమలలో పర్యటనతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.

Updated : 03 Jul 2024 05:22 IST

కదలిన అధికార యంత్రాంగం 
ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ

కొల్లాపూర్, న్యూస్‌టుడే : చెంచు మహిళ ఈశ్వరమ్మపై అమానుష దాడి.. మరో గిరిజనుడి మృతి, జాతీయ ఎస్టీ కమిషన్‌ నల్లమలలో పర్యటనతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత చెంచుల నుంచి ఓటరు నమోదుకు ప్రత్యేకంగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు తీరేనా అని చెంచు గిరిజనులు ఎదురుచూస్తున్నారు. 

27 దరఖాస్తుల స్వీకరణ.. : నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ నల్లమల ప్రాంతంలో గూడెలలో నివసిస్తున్న చెంచు గిరిజనులలో చాలామందికి ఆధార్, రేషన్‌కార్డు, ఓటరు నమోదు కార్డులు లేవు. జనన, మరణ ధృవపత్రాలు, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకుండా పోయాయి. దీంతో ప్రభుత్వ సంక్షేమం అందకుండా పోతున్నది. మొలచింతలపల్లిలో చెంచు ఈశ్వరమ్మపై దాష్టికం, చెంచు గిరిజనుడు నాగన్న అనుమానాస్పద మృతి తదితర సంఘటనలతో సంబంధిత రెవెన్యూ, పోలీస్, ప్రభుత్వం స్పందించింది. గత రెండు రోజులుగా బుధవారం, గురువారం మొలచింతలపల్లి గూడెంలో 18 ఏళ్ల వయస్సు నిండిన చెంచు యువకులు, మహిళల నుంచి సంబంధిత అంగన్‌వాడీ, రెవెన్యూ సిబ్బంది ఓటరు నమోదుకు ధరఖాస్తులు తీసుకుంటున్నారు. 27 దాకా ధరఖాస్తులు వచ్చినట్లు కొల్లాపూర్‌ తహశీల్దార్‌ శ్రీకాంత్‌ చెప్పారు. 

సమస్యలిలా.. : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలతో పాటు అచ్చంపేట ప్రాంతంలో చెంచు గిరిజనులు నివసిస్తున్నారు. నేటికి కూడా మొలచింతలపల్లిలో 300ల చెంచు కుటుంబాలు ఉండగా 60 మందికి ఓటు హక్కు నమోదు లేదు. అమరగిరిలో 10 కుటుంబాలు, నార్లాపూర్‌ గూడెంలో 15 కుటుంబాలు, తిర్నాంపల్లిలో 5 కుటుంబాలు, యాపట్ల చెంచుకాలనీలో 5 కుటుంబాలు, దేదినేనిపల్లి, మర్రికల్‌ గ్రామాల్లో 4 కుటుంబాలకు ఓటు హక్కు నమోదు పత్రాలు లేవు. ఈ కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే 1,200 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏటా చెంచు జనాభా అంతరించిపోతోంది. అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడంతో వెట్టిపనులు, వలసలతో చెంచుల మరణాల రేటు ఎక్కువగా ఉందని చెంచు సేవాసంఘం నేతలు హన్మంతు, వెంకటస్వామి, మల్లేష్, బయ్యన్న, తదితరులు చెప్పారు. సాగు చేసుకుంటున్న భూములకు పోడుపట్టాలు ఇవ్వడం లేదన్నారు. ఇంకా వంద ఎకరాలకు పోడుపట్టాలు అందలేదన్నారు. ఇప్పటికైనా పుట్టిన పిల్లలకు జనన పత్రాలతో పాటు ఆధార్, రేషన్‌కార్డులు, అర్హత గల యువతకు ఓటు హక్కు నమోదుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలని వారు కోరారు. ఈ సమస్యలపై కొల్లాపూర్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ స్పందిస్తూ గూడెల వారీగా చెంచుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. అర్హత గల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని చెప్పారు. చెంచుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని