logo

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

పాలమూరులోని పలు పరిశ్రమల్లో కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 03 Jul 2024 04:32 IST

పరిశ్రమల్లో కార్మికుల దయనీయ పరిస్థితి  
ప్రమాదం జరిగితే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులోని పలు పరిశ్రమల్లో కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పూర్వ మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్‌ సమీపంలో ఇటీవల ఓ గ్లాస్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పాలమూరులో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద ఓ స్పిరిట్‌ పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రాజాపూర్‌ మండలంలోని ఓ పరిశ్రమలో కూడా ఇద్దరు మృత్యువాత పడ్డారు. వనపర్తి జిల్లాలోని ఓ లిక్కర్‌ పరిశ్రమల్లో  ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాలానగర్, రాజాపూర్‌ మండలాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. బయటకు రాకుండా యజమానులు జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 665 పరిశ్రమలున్నాయి. వీటిలో 31,910 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో సగానికిపైగా ప్రమాదకర పరిస్థితుల మధ్య పనులు చేస్తున్నారు. 

పని చేయాలంటే.. : మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి పారిశ్రామికవాడతోపాటు ఫార్మా సెజ్‌లో మొత్తం 25 భారీ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఇందులో ప్రమాదకర రసాయనాలతోపాటు బాయిలర్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో ఉష్ణోగత్ర కూడా అధికంగా ఉంటుంది. ఏ మాత్రం యంత్రాల వద్ద పరిస్థితి అదుపు తప్పినా ప్రాణాలకు ప్రమాదమే. గతంలో కొన్ని పరిశ్రమల్లో యంత్రాల వద్ద పని చేస్తూ మృత్యువాత పడ్డ ఘటనలున్నాయి.

  • బాలానగర్, రాజాపూర్‌ మండలాల్లో 30 వరకు స్పాంజ్, జిన్నింగ్‌ మిల్లు పరిశ్రమలున్నాయి. ప్రధానంగా స్పాంజ్‌ పరిశ్రమల్లో కొన్నిచోట్ల కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. గత్యంతరం లేక కార్మికులు ఈ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వీటిల్లో ప్రమాదాలు జరిగినా చాలావరకు బయటకు రాకుండా చూస్తున్నారు. 
  • వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో బియ్యం, జిన్నింగ్‌ మిల్లులున్నాయి. ఇటీవల కొత్తగా ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్నిచోట్ల ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు పని చేయాల్సి వస్తోంది. 

సగానికిపైగా ఉత్తరాది వాళ్లే.. : తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, అస్సాం, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ పరిశ్రమల్లో ఎక్కువగా పని చేస్తున్నారు. వీరంతా కుటుంబాలను సొంత రాష్ట్రాల్లో ఉంచి ఇక్కడ పని చేస్తున్నారు. వీరికి బస ఆయా పరిశ్రమ ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. రోజూ 12 గంటల చొప్పున పని చేయాల్సి ఉంటుంది. బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. వీరికి ఇతరులతో సంబంధాలు ఉండవు. కొన్ని పరిశ్రమల్లో పని ప్రదేశాల్లో రక్షణ చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని వాదనలున్నాయి. వైద్యసేవలు అందుబాటులో ఉంచరు. ప్రమాదాల్లో మృతి చెందినా, తీవ్రంగా గాయపడ్డా రావాల్సిన పరిహారం సక్రమంగా అందడం లేదనే ఆరోపణలున్నాయి.  


రిశ్రమల్లో పని చేసే కార్మికుల భద్రతపై తప్పనిసరిగా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిప్రమాదం తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. తమశాఖ ఆధ్వర్యంలో ప్రతి పరిశ్రమలో కార్మికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తున్నాం. ప్రమాదాల బారిన పడితే బాధితులకు రావాల్సిన పరిహారాలను అందించేలా చర్యలు తీసుకుంటాం. 

చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్, కార్మిక శాఖ, మహబూబ్‌నగర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని