logo

తొలిరోజు తొమ్మిది కేసులు

కృష్ణ మండల కేంద్రంలోని ఓ కిరాణం షాపులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. సోమవారం టాస్క్‌ఫోర్స్, కృష్ణ పోలీసులు సంయుక్తంగా దుకాణంపై దాడి చేసి రూ.9,335ల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు.

Published : 03 Jul 2024 05:23 IST

ఉమ్మడి జిల్లాలో సగటు కంటే తక్కువగా నమోదు
కొత్త చట్టాలు, సెక్షన్లతో పోలీసుల కసరత్తు 
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం 

కృష్ణ మండల కేంద్రంలోని ఓ కిరాణం షాపులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. సోమవారం టాస్క్‌ఫోర్స్, కృష్ణ పోలీసులు సంయుక్తంగా దుకాణంపై దాడి చేసి రూ.9,335ల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. దుకాణదారుడిపై కొత్త చట్టం బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 223, 272, 275 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఐపీసీ 188, 270, 273 సెక్షన్ల కింద కేసు నమోదు చేసే వారు. కొత్త చట్టం ప్రకారం రూ.5వేల వరకు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా 

  • నారాయణపేట :04 
  • నాగర్‌కర్నూల్‌ :02
  • వనపర్తి :01
  • జోగులాంబ గద్వాల :01
  • మహబూబ్‌నగర్‌ :01 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఠాణాలకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తొలిరోజైన జులై 1న ఉమ్మడి జిల్లాలో కేసుల నమోదు సంఖ్య చాలా తగ్గిపోయింది. పోలీసు అధికారులు నేరాలు కొత్త చట్టాల్లోని ఏయే సెక్షన్ల కిందకు వస్తాయో క్షుణ్ణంగా పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌ చేస్తున్నారు. నిత్యం చాలా కేసులు నమోదయ్యే మహబూబ్‌నగర్‌ గ్రామీణా ఠాణాలో ఒక్కటి కూడా కాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 నుంచి 15 వరకు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 నుంచి 40 కేసులు చేసేవారు. అలాంటిది తొలిరోజు 9 కేసులే నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లాలో నారాయణపేట పట్టణం, మక్తల్, కృష్ణ, దామరగిద్ద ఠాణాల్లో ఒక్కోటి చొప్పున నాలుగు కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్, చారగొండ ఠాణాల్లో ఒకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. వనపర్తిలో అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనపై కేసు నమోదైంది. రాజోలిలో ఒకటి, మహబూబ్‌నగర్‌ రెండో పట్టణ ఠాణాలో ఒకటి చొప్పున రెండు అనుమానాస్పద మృతి కేసులు నమోదయ్యాయి. 


భూత్పూర్‌ పురపాలిక అమిస్తాపూర్‌కు చెందిన పెద్ద చిన్నయ్య(47) గత నెల 30న వ్యవసాయ పనులు చేస్తుండగా ఎడమ కాలికి గాయమైంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కాలుకు శస్త్రచికిత్స చేశారు. మరుసటి రోజు సోమవారం ఉదయం చనిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన భర్తకు 339 ఎంజీ./డి.ఎల్‌. మేర మధుమేహం ఉన్నట్లు రిపోర్టు వచ్చినా శస్త్రచికిత్స చేశారని, ఆయన మృతికి వైద్యులే కారణమని చిన్నయ్య భార్య రెండో పట్టణ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్‌ 194 సెక్షన్‌ కింద అనుమానాస్పద మృతిగా చేసు నమోదు చేశారు. గతంలో 174 ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసేవారు.


జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

- డి.జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్‌  

పోలీసు శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు 238 పేజీలతో ప్రత్యేక బుక్‌లెట్‌ పంపించారు. అందులో ఏ విషయానికి ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలో ఉంది. వాంగ్మూలం, ఆడియో, వీడియో స్టేట్‌మెంట్లను రికార్డు చేయడానికి కొత్త విధానం అమలులోకి వచ్చింది. అందువల్ల అన్ని వివరాలు తీసుకుని జాగ్రత్తగా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త చట్టాల్లోని సెక్షన్లపై పట్టు రావడానికి కొంత సమయం పడుతుంది. మా సిబ్బందికి రోజూ ఉదయం 15 నిమిషాలు తర్ఫీదు ఇస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని