logo

కార్మికుల సంక్షేమానికి భరోసా కరవు

భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు భరోసా కరవైంది. కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందడం లేదు.

Published : 03 Jul 2024 04:25 IST

అచ్చంపేట న్యూటౌన్, న్యూస్‌టుడే : భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు భరోసా కరవైంది. కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందడం లేదు. కార్మికుల సంక్షేమంపై క్షేత్ర స్థాయిలో అవగాహన లేకపోవడంతో కనీసం గుర్తింపు కార్డులు కూడా పొందలేకపోతున్నారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌లో సహాయ కార్మిక శాఖ కార్యాలయాలున్నాయి. జిల్లా కేంద్రంలోని కార్మిక సహాయ అధికారి ఇటీవల పదవీ విరమణ పొందడంతో కల్వకుర్తికి చెందిన మహేందర్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. వనపర్తికి చెందిన వేణుగోపాల్‌ రెండేళ్ల నుంచి అచ్చంపేటకు ఇన్‌ఛార్జి అధికారిగా కొనసాగుతున్నారు. అచ్చంపేటలో విధులు నిర్వహించే అధికారి ప్రతి గురు, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు కార్యాలయం వద్ద సూచిక బోర్డును ప్రదర్శించారు. దీంతో మిగిలిన రోజుల్లో కార్యాలయానికి తాళం కూడా తీయడం లేదు. అచ్చంపేట, కల్వకుర్తిలో నేటికి అద్దె భవనాల్లోనే కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 42,697 మంది భవన నిర్మాణ కార్మికులుండగా, 99,226 మంది పురపాలిక, పంచాయతీ, హమాలి తదితర అసంఘటిత రంగాల్లోని కార్మికులు ఈశ్రమ్‌ పథకానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అందులో కల్వకుర్తిలో 7,264 మంది కాగా అచ్చంపేటలో 11,470 మంది అర్హులుగా నమోదై ఉన్నారు. అచ్చంపేట సహాయ కార్మిక శాఖ పరిధిలో కార్మికుల సంక్షేమానికి అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈశ్రమ్‌ గుర్తింపు కార్డులివ్వాల్సిన అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

ఈశ్రమ్‌తో ఉపయోగాలు .. : అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈశ్రమ్‌ పథకం ద్వారా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. రూ.110 లు చెల్లించి కార్మికుడిగా గుర్తింపు కలిగి ఉన్న కుటుంబాల్లో అమ్మాయి వివాహానికి రూ.30 వేలు, అనంతరం రెండు ప్రసవాల వరకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తారు. రెండో అమ్మాయి వివాహానికి కూడా పథకం వర్తిస్తుంది. అదేవిధంగా కార్మికులు సాధారణంగా మరణిస్తే రూ.1.30 లక్షలు, ప్రమాధంలో మరణిస్తే రూ.6.30 లక్షలు పొందవచ్చు. పని ప్రదేశంలో గాయపడినా పరిస్థితిని బట్టి పరిహారం అందుతుంది. కార్మికులు ప్రతి ఐదేళ్లకోసారి రూ.60 లను చెల్లించి గుర్తింపు కార్డులను రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


అర్హులందరూ కార్డు పొందాలి : జిల్లాలో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులందరు ఈశ్రమ్‌ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. పథకం ద్వారా క్షేత్ర స్థాయిలో అందుతున్న ప్రోత్సాహం, పరిహారంపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా వ్యాప్తంగా కార్మికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. కార్మికుల కుటుంబాల్లో అమ్మాయి వివాహానికి ప్రోత్సాహం, కార్మికులు గాయపడినా, మరణించినా పరిహారం పొందే అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నాం.. 

మహేందర్, ఇన్‌ఛార్జి జిల్లా కార్మిక శాఖాధికారి  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని