logo

నేటితో ముగియనున్న ఎంపీటీసీల పదవీ కాలం

మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3తో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మండల పరిషత్తుల పాలకవర్గాల గడవు కూడా ముగుస్తుంది.

Published : 03 Jul 2024 04:24 IST

నిధులు, విధుల కోసం పోరాడినా దక్కని ఫలితం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం : మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3తో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మండల పరిషత్తుల పాలకవర్గాల గడవు కూడా ముగుస్తుంది. మండల పరిషత్తులు ప్రత్యక్ష అధికారుల పాలన, పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 719 మంది ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందారు. వీరిలో కొందరు వివిధ కారణాలతో రాజీనామా చేయగా పలువురు మృతి చెందారు. ఆది నుంచి ఎంపీటీసీ సభ్యులు తమకు విధులు కేటాయించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా లాభం లేకపోయింది. అయిదేళ్ల కాలంలో ఎంపీటీసీ సభ్యులకు ఆశించిన మేర నిధులు కూడా మంజూరు కాలేదు. 

ఐదేళ్లలో వచ్చింది రూ.8లక్షల లోపే : అయిదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి రూ.8లక్షల నిధులు కూడా విడుదల కాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి ఓ ఏడాది రూ.1.50లక్షలు, మరో ఏడాది రూ.2లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రెండేళ్లే, అదీ రూ.2లక్షల చొప్పున రూ.4లక్షలే వచ్చాయి. ఇంకా రెండేళ్ల నిధులు రావాల్సి ఉంది. మొత్తం మీద ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను వారు గ్రామాల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలకు కేటాయించారు. 

పంచాయతీల్లో కుర్చీ దక్కలేదు..: రెండు, మూడు గ్రామాలకు ఒక ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందిన తమకు ఆయా పంచాయతీల్లో తమకు ప్రత్యేక కుర్చీ, టేబుల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినా నెరవేరలేదు. గ్రామ, మండల స్థాయి అభివృద్ధి కమిటీల్లో సభ్యులుగా నియమించాలన్న కోరికా నెరవేరలేదు. మండల పరిషత్తు స్థాయీ సంఘాలను పునరుద్ధరించాలని, మండల పరిషత్తు పాఠశాలలకు తమను ఛైర్మన్లుగా నియమించాలని, ప్రతి ఎంపీటీసీకి ఏటా రూ.20లక్షల నిధులు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించాలని ఆందోళనలు చేసినా ఫలితం దక్కలేదు. 


ఆరు నెలలుగా వేతనం అందలే : పలుమార్లు మా 29 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఒక్కటీ నెరవేరలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ మరో దఫా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వచ్చిన కొద్ది పాటి నిధులతో చిన్న చిన్న పనులు చేశాం. ఆరు నెలలుగా మాకు ఇచ్చే గౌరవ వేతనం కూడా ఇవ్వలేదు. 

రఘునాథ్, ఎంపీటీసీ సభ్యుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని