logo

సామాజిక స్థలాలు.. పరులపాలు

జిల్లాలోని పలుగ్రామాల్లో సామాజిక అవసరాలకోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పంచాయతీ యంత్రాంగం కానీ, అధికారులు కానీ వాటివైపు కన్నెత్తి చూడటం లేదు.

Updated : 03 Jul 2024 05:20 IST

న్యూస్‌టుడే-నారాయణపేట న్యూటౌన్‌

జిల్లాలోని పలుగ్రామాల్లో సామాజిక అవసరాలకోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పంచాయతీ యంత్రాంగం కానీ, అధికారులు కానీ వాటివైపు కన్నెత్తి చూడటం లేదు.

  • ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో 1996లో ప్రభుత్వం సర్వే నంబరు ఒకటిలోని మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇళ్ల కోసం కేటాయించింది. సామాజిక అవసరాలకు కొంత స్థలాన్ని కేటాయిస్తూ మిగిలిన స్థలాన్ని వంద ప్లాట్లుగా విభజిస్తూ అర్హులకు అందజేసింది. జాగాను కబ్జా చేసి నిర్మాణం చేశారు. ప్రహరీ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ ప్రహరీ కింద ట్యాంకుకు నీటి సరఫరా చేసే పైపులైన్‌ ఉందని, పక్కనే సోర్సుబోరు ఉందని చెబుతూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టింపు లేదని గ్రామస్థులు అంటున్నారు.
  • మక్తల్‌ మండలంలోని చిట్యాల, పంచలింగాల గ్రామాలలోనూ గతంలో ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందజేయగా సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కనిపించడంలేదని ఫిర్యాదులు ఉన్నాయి .
  • కోస్గి గ్రామ పంచాయతీగా ఉన్న సమయాన పలు ప్రైవేటు వెంచర్లు వెలిశాయి. నిబంధనల ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం పదిశాతం భూమిని కేటాయించారు. అయితే భూమిని పంచాయతీ పాలకులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో కేటాయించిన భూమిని వెంచర్‌ వారే అమ్ముకున్నారు. ఈ పట్టణంలో ప్రభుత్వం సైతం ఇండ్లులేని వారికి పట్టాలను అందజేసింది. ఇక్కడ కమ్యూనిటీ అవసరాలకు కేటాయించిన భూమిలో దేవాలయాన్ని మాత్రం నిర్మించారు.
  • మరికల్‌ పట్టణంలోనూ డీటీసీపీ వ్యవస్థ రాక ముందు ఏర్పాటైన పలు వెంచర్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు అప్పటి పాలకులు, వారి అనుచరులే కబ్జాలు చేసేశారు. ప్రభుత్వ పరంగా అందజేసిన ప్లాట్లలోనూ కేటాయించిన స్థలాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. పై మండలాల్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలన్నియు కబ్జా పాలవుతుండటంపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • ప్రభుత్వం జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్లు లేని వారికి స్థలాలను పంపిణీ చేస్తూ వస్తుంది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఆ స్థలాన్ని, లేదంటే ప్రైవేటుగా కొనుగోలు చేసి అందజేస్తూ వచ్చింది. ఈ లేఅవుట్లలో సామాజిక అవసరాలకు కొంత భూమిని కేటాయించింది. దేవాలయం, పాఠశాల, లేదా పార్కు, అంగన్‌వాడీ భవనం తదితరాల నిర్మాణాలకు స్థలాలు అవసరం పడుతాయన్న ఉద్ధేశ్యంతో కేటాయించగా అత్యధిక చోట్ల ఈ స్థలాలన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. ధన్వాడలోనూ బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ లేఅవుట్లో సామాజిక స్థలాల ఆనవాళ్లు లేవు. ఇక్కడ పలువురు ప్రైవేటు వెంచర్లను ఏర్పాటు చేయగా గ్రామ పంచాయతీ దక్కాల్సిన పది శాతం భూమి జాడే లేదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని