logo

ఖిల్లాలో భూ మాయ

ఖిల్లాగణపురం మండల కేంద్రంలో 1996 సంవత్సరంలో రెండు సర్వే నంబర్లలో 33 ఎకరాలలో ప్లాట్లు చేశారు.

Published : 03 Jul 2024 04:17 IST

గ్రామపంచాయతీలో మాయమైన దస్త్రాలు

ఖిల్లాగణపురం(వనపర్తి న్యూటౌన్‌), న్యూస్‌టుడే : ఖిల్లాగణపురం మండల కేంద్రంలో 1996 సంవత్సరంలో రెండు సర్వే నంబర్లలో 33 ఎకరాలలో ప్లాట్లు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పట్లో గ్రామ పంచాయతీకి వెంచర్‌ నిర్వాహకులు 3.03 ఎకరాల భూమిని అప్పగించారు. దీనికి సంబంధించిన దస్త్రాలు గ్రామపంచాయతీలో మాయమయ్యాయి. ఆ భూమి రహదారి పక్కన ఉండటంతో రూ. కోట్ల విలువ చేస్తోంది. కన్నేసిన కొందరు నాయకులు ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. 

మినీస్టేడియానికి కేటాయింపు 

1996లో వెంచర్‌ నిర్వాహకులు 3.03ఎకరాలను పంచాయతీకి అప్పగించారు. ఇందులో నుంచి 2001 ఫిబ్రవరి 19న మినిస్టేడియం కోసం మూడెకరాలను కేటాయిస్తూ గ్రామపంచాయతీ నుంచి తీర్మానం చేసి ఇచ్చారు. మూడు గుంటల భూమిని అప్పట్లో పనిచేసిన విలేకరులకు ప్లాట్లు కేటాయించారు. మినీస్టేడియం కోసం స్థలం సరిపోదని మరికొంత స్థలం కావాలని క్రాంతి క్రీడా అసోసియేషన్‌ సభ్యులు అప్పట్లో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి లింగ్యానాయక్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఓ సర్వే నంబరులో అప్పటి తెదేపా హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో లింగ్యానాయక్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి స్టేడియానికి స్థలం సరిపోదని బీసీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన స్థలంలో నాలుగెకరాలను కేటాయించి తీర్మానం చేశారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. 20 ఎకరాలలో 5 ఎకరాలు విద్యుత్తు ఉపకేంద్రం, స్టేడియం, తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం ఏడు ఎకరాలు, ప్లాట్లలో రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం కోసం ఎనిమిదెకరాల స్థలాన్ని కేటాయించి అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారు. మినీస్టేడియానికి ఇచ్చిన మూడెకరాల భూమిని కొందరు నాయకులు ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సహకారంతో భూమాయ జరిగిందని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ గ్రామ పంచాయతీ కార్యదర్శి రవితేజరెడ్డిని వివరణ కోరగా.. వెంచర్‌ నిర్వాహకులిచ్చిన పదిశాతం భూమికి సంబంధించిన వివరాలు మా వద్ద లేవని తెలిపారు. గతంలో పనిచేసిన గ్రామకార్యదర్శులు దానికి సంబంధించిన వివరాలను అప్పగించలేదని చెప్పారు. 


ఆక్రమణకు గురైంది

- బుచ్చిబాబుగౌడ్, ఖిల్లాగణపురం.

ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మినీస్టేడియం కోసం మూడెకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలం సరిపోదని 2012లో తహసీల్దార్, గ్రామప్రత్యేకాధికారి లింగ్యానాయక్‌ దృష్టికి తీసుకెళ్లగా.. పంచాయతీ గ్రామసభ నిర్వహించి మరో నాలుగెకరాలతో మొత్తం ఏడు ఎకరాలు కేటాయించారు. పంచాయతీకి వెంచర్‌ నిర్వాహకులు ఇచ్చిన స్థలం ఆక్రమణకు గురైంది. 


ఏడు ఎకరాలు కేటాయించాం

- పాండు, తహసీల్దార్, ఖిల్లాగణపురం. 

ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మినీస్టేడియం కోసం ఏడు ఎకరాల స్థలం కేటాయించాం. ఇటీవల ఎకర స్థలాన్ని క్రీడా ప్రాంగణానికి కేటాయించాం. వెంచర్‌ నిర్వాహకులు ఇచ్చిన స్థల వివరాలు మా వద్ద లేవు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని