logo

భూదాన్‌ భూమికి రెక్కలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నడిబొడ్డులో ఉన్న భూదాన్‌ భూమికి రెక్కలొచ్చాయి.

Updated : 02 Jul 2024 05:31 IST

జడ్చర్ల పట్టణంలో మాయాజాలం

ఈనాడు, మహబూబ్‌నగర్‌-న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నడిబొడ్డులో ఉన్న భూదాన్‌ భూమికి రెక్కలొచ్చాయి. రెండెకరాల్లో ఉన్న ఈ భూమి ఇప్పుడు రికార్డుల్లో కనిపించడం లేదు. పట్టణంలో ఎకరా విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. దీంతో భూదాన్‌ భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. తెర వెనుక కొందరిని పెట్టి రూ.కోట్ల విలువైన ఈ భూమిని రికార్డుల్లో లేకుండా చేసి తర్వాత పట్టాగా మార్చుకున్నారు. గతంలో ఇక్కడ భూదాన్‌ భూమి ఉందని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టంగా ప్రొసీడింగ్స్‌ ఇచ్చినా కూడా దానికి ఎన్‌వోసీ ఇచ్చి పట్టాగా మార్చడం గమనార్హం.

 జడ్చర్లలోని ఓ సర్వే నంబరులో 2023 జులైలో 2.10 ఎకరాల్లో భూదాన్‌ భూమి ఉందని తహసీల్దార్‌ రిపోర్టు ఇచ్చారని కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ఉత్తర్వులు

జడ్చర్లలోని ఓ సర్వే నంబరులో మొత్తం 16.32 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 2.10 ఎకరాల స్థలం భూదాన్‌ భూమికి సంబంధించింది. ఈ స్థలాన్ని జడ్చర్ల మొదటి ఎమ్మెల్యే కొత్త కేశవులు 1957-58లో భూదాన్‌ యజ్ఞంలో భాగంగా ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. తర్వాత ఈ భూమిని పోతిరెడ్డిపల్లి చెన్నయ్యకు అసైన్డు చేశారు. ఈ భూమిని ఆ కుటుంబం కేవలం సాగు చేసుకుని జీవనాధారం పొందాలి. వారసత్వంగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయించవచ్చు. ఈ భూమిని అమ్మడం, కొనడం చేయకూడదు. కేవలం జీవనోపాధికే ఉపయోగించుకోవాలి. లేకుంటే ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి. చెన్నయ్య తర్వాత ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఈ భూమిని బదిలీ చేశారు. 2023లో దీనిని పట్టాగా మార్చడానికి కొందరు ప్రయత్నించారు. అప్పటి తహసీల్దారు ఖాస్రా రికార్డు ఆధారంగా ఆ సర్వే నంబరులో 16.32 ఎకరాల స్థలం ఉందని, ఇందులోనే కొత్త కేశవులుకు సంబంధించిన 2.10 ఎకరాలు భూదాన్‌ బోర్డుకు అందించారని, ఇది నిషేధిత జాబితాలోకి వస్తుందని నివేదిక ఇచ్చారు. దీనిపై అప్పటి కలెక్టర్‌ ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌ కూడా ఇచ్చారు. తర్వాత ఏమైందో.. 2024 ఏప్రిల్‌ నుంచి ఈ భూమి పట్టాగా మారిపోయింది. రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఈ సర్వేనంబరులో 2.10 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పొందు పరిచారు. కానీ ధరణిలో ఎలా రికార్డుల నుంచి మాయం చేశారన్న దానిపై రెవెన్యూ శాఖే సమాధానం చెప్పాలి.  

ఆ భూములు నిషేధిత జాబితాలోకి..

ఈ సర్వే నంబరులో 2.10 ఎకరాల భూదాన్‌ భూమి పోగా మిగతా 14.22 ఎకరాలు పట్టా భూమిగా ఉంది. ఈ భూమిని ప్రస్తుతం ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. భూదాన్‌ భూమిని జాబితా నుంచి తొలగించి పట్టా భూముల్ని ఎలా చేర్చుతారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూదాన్‌ భూమికి ఎన్‌వోసీ ఇచ్చిన సమయంలోనే పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తప్పించుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నంబరులో పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. వెంచర్లు వేస్తే రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. స్థిరాస్తి వ్యాపారులు, నేతల ప్రమేయం ఉంది. ఈ సర్వే నంబరుపై హైడ్రామా కొనసాగుతోంది. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే ధరణిలో దరఖాస్తు చేసుకోవాలి. సీసీఎల్‌ఏ నుంచి అనుమతులు రావాలి. దీనికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీనిపై జడ్చర్ల తహసీల్దార్‌ సత్యనారాయణరెడ్డిని ‘ఈనాడు’ వివరణగా కోరగా ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, నిషేధిత జాబితాలో ఈ భూమి ఉన్నట్లు కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు చెప్పారు.

భూదాన్‌ భూములు నిషేధిత జాబితాలోనే ఉంటాయి. జడ్చర్లలోని సర్వే నంబరులో ఎన్ని ఎకరాలు భూమి ఉంది? భూదాన్‌ భూమి ఎంత ఉంది? నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారు? రిజిస్ట్రేషన్‌ ఎలా చేశారు? వంటి వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం.

మోహన్‌రావు, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని