logo

మట్టి మిద్దె కింద తెల్లారిన బతుకులు

రెక్కాడితే గాని పూట గడవని ఓ పేద కుటుంబాన్ని మృత్యువు కబలించింది.

Published : 02 Jul 2024 03:12 IST

కుటుంబంలో నలుగురి మృతితో వనపట్లలో విషాదఛాయలు

వనపట్లలో కూలిన భాస్కర్‌ మట్టి మిద్దె

కందనూలు, న్యూస్‌టుడే : రెక్కాడితే గాని పూట గడవని ఓ పేద కుటుంబాన్ని మృత్యువు కబలించింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందిన విషాద ఘటన సోమవారం తెల్లవారుజామున మండలంలోని వనపట్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు బాలస్వామి, గొడుగు చిట్టెమ్మ దంపతులకు ఒక కుమారుడు భాస్కర్‌ ఉన్నారు. తల్లిదండ్రులు తమకు ఉన్న 1.20 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. భాస్కర్‌ మాత్రం సొంత ఆటోను నడుపుతున్నాడు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన భాస్కర్‌ మేనత్త కూతురు పద్మ (26)తో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులకు పద్మ ఏకైక కుమారై, పద్మకు మాత్రం ఇద్దరు అమ్మాయిలు తేజశ్విని (07), వసంత (05) కుమారుడు రిత్విక్‌ (10 నెలలు) ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఐదు నెలల క్రితం రిత్విక్‌ నామకరణ డోలాహరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి భోజనం చేసిన తరువాత బాలస్వామి, చిట్ట్టెమ్మ ఇద్దరు కలిసి కుమారుడు, కోడలును ముందుభాగంలో ఉన్న రేకుల వరండాలో పడుకోండి మేము ఇంట్లో నిద్రిస్తామని చెప్పగా బయట దోమలున్నాయని భాస్కర్, పద్మ పిల్లలతో ఇంట్లో నిద్రించారు. రాత్రి వర్షం నేపథ్యంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన మట్టి మిద్దె శిథిలావస్థకు చేరి తెల్లవారుజామున కూలిపోయింది. ప్రమాదంలో పద్మ, తేజ అశ్విని, వసంత, రిత్విక్‌ మట్టిలో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. భాస్కర్‌పైన మట్టి దిబ్బలు పడ్డాయి. ఇల్లు కూలిన సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బయట నిద్రిస్తున్న తల్లిదండ్రులు అప్రమత్తమై కేకలు వేయడంతో ఇంటి పక్కన ఉన్న వారు స్పందించారు. మట్టి కింద ఇరుక్కుపోయిన పద్మ, చిన్నారులను బయటికి తీయగా అప్పటికే వారు మృతి చెందారు. భాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని జనరల్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన మహిళ, అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందడటంతో వనపట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, సీఐ కనకయ్య, ఎస్సై గోవర్దన్, రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరవుతున్న బంధువులు

  జనరల్‌ ఆసుపత్రి వద్ద భాస్కర్‌ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని