logo

ప్రతి పల్లెలో మీసేవ కేంద్రం

ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది.

Published : 02 Jul 2024 03:10 IST

ఉమ్మడి జిల్లాకు 131 మంజూరు
మహిళలతో ఏర్పాటుకు డీఆర్డీఏ కసరత్తు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం

ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది. ‘మహిళా శక్తి’ పేరుతో మంజూరు చేస్తున్న మీసేవ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులైన అతివలకు అప్పగించబోతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 131 మీసేవ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేశారు. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాకే అత్యధికంగా 70 మీసేవ కేంద్రాలు కేటాయించారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాకు నాలుగు కేంద్రాలు మంజూరయ్యాయి.

స్వయం సహాయక సంఘాల సభ్యులకు మీసేవ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్న సీసీలు

స్వశక్తి సంఘాలకు అవగాహన: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. కేంద్రాల నిర్వహణ బాధ్యతలు సహాయక సంఘాల్లో సభ్యులకే అప్పజెప్పాల్సి ఉండటంతో మహిళల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. కేంద్రాలు మంజూరైన గ్రామాల జాబితాలు పట్టుకుని ఆయా ఊళ్లకు వెళ్తున్న అధికారులు గ్రామైక్య సంఘాలతో సమావేశమవుతున్నారు. నెలవారి పొదుపుల ప్రగతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాల రికవరీ తీరు పరిగణనలోకి తీసుకుని ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట వారికి మీసేవ కేంద్రం నిర్వహణపై ప్రాథమికంగా అవగాహన కల్పిస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు కావాల్సిన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు వివరిస్తున్నారు. ఇంటర్, ఆపై ఎక్కువ చదువుకున్న మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. నిబంధనలు వివరించాక గ్రామైక్య సంఘం సమావేశంలో మీసేవ కేంద్రం నిర్వహణకు ముందుకు వచ్చే మహిళల పేర్లు తెలియజేయాలని.. నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వహణకు ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన మహిళలు ఎక్కువ మంది ముందుకు వస్తే వారిలో అర్హులను ఎంపిక చేయాలని గ్రామైక్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు సూచిస్తున్నారు.

ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహణ..: మీసేవ కేంద్రాలను గ్రామాల్లోని ప్రైవేటు భవనాల్లో, ఇళ్లల్లో.. ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం స్పష్టంచేసింది. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల భవనాలు, కమ్యూనిటీ భవనాలు, యువజన సంఘాల భవనాల్లో మాత్రమే మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మీసేవ కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘం సభ్యురాలికి గ్రామైక్య సంఘం సిఫారసుతో స్త్రీనిధి ద్వారా రూ.2.50 లక్షల రుణం మంజూరు చేస్తారు. ఈ డబ్బుతో సభ్యురాలు మీసేవ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన కంప్యూటరు, ప్రింటరు, జీపీఎస్, బయోమెట్రిక్‌ పరికరాలు, కెమెరా, టేబుళ్లు, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ వంటివి సమకూర్చుకుంటారు. మీసేవ కేంద్రం ద్వారా ధరణి, స్థానికత, ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువపత్రాలు, ఆధార్, ఆర్టీసీ, రైల్వే, తిరుమతి దర్శనం టికెట్ల రిజర్వేషన్‌ వంటి 40 రకాల సేవలను ప్రజలకు అందించి ఆదాయం పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని