logo

శిథిల భవనాల్లో బతుకు భద్రమేనా!

వర్షాకాలం వస్తుందంటేనే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతోంది. పాలమూరులో చాలామంది మట్టి మిద్దెల్లోనే నివాసం ఉంటున్నారు.

Published : 02 Jul 2024 03:08 IST

ధరూరులో భారీ వర్షానికి కూలిన ఇల్లు (పాతచిత్రం)

ధరూరు న్యూస్‌టుడే: వర్షాకాలం వస్తుందంటేనే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతోంది. పాలమూరులో చాలామంది మట్టి మిద్దెల్లోనే నివాసం ఉంటున్నారు. భారీ వర్షాల కారణంగా మట్టి మిద్దెలు, శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయి అమాయకులు బలవుతున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్‌ జిల్లా వనపట్లలో మట్టి మిద్దె కూలిపోయి నలుగురు దుర్మరణం పాలవ్వడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో పూర్వం మట్టి మిద్దెలే నివాసాలుగా ఉండేవి. ఇప్పటికీ పేద, మధ్యతరగతి వర్గాలు చాలామంది ఈ ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏటా వర్షాకాలంలో శిథిల భవనాలు కూలి మృత్యువాత పడుతూనే ఉన్నారు. 2020లో భారీ వర్షాలకు మట్టిమిద్దెలు, భవనాలు కూలిన ఘటనలో ఉమ్మడి జిల్లాలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం రాకొండలో మట్టిమిద్దె కూలిపోయి తల్లీకుమార్తెలు మృతి చెందారు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని 2021, 2022లో పల్లెప్రగతిలో చాలా వరకు శిథిలమైన ఇళ్లు, పట్టణాల్లో శిథిల భవనాలను కూల్చివేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా ఉండి నివాసం ఉంటున్న వాటిని కూల్చడానికి ఇంటి యజమానులు అనుమతి ఇవ్వకపోవటంతో వాటిని అలాగే వదిలేశారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లనే తాత్కాలిక మరమ్మతులు చేసి వాటిలోనే నివాసం ఉంటున్నారు.  

శిథిలావస్థలోని ఇళ్లలో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరాన్ని చెబుతూ మే 21న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం

46 వేలకు పైగా: పాలమూరు జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన గణాంకాల ప్రకారం 46,701 పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయి. వాటిలో గత మూడేళ్లలో సుమారు 3,500 పైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలను కూల్చేశారు. పట్టణ, పల్లెప్రగతిలో దాదాపుగా 14,690 పైగా నిర్మాణాలు కూల్చి శిథిలాలను తొలగించారు. వాటిలో కూడా ఆర్థిక స్థోమత ఉన్న వారు నిర్మాణాలు చేసుకోగా మిగిలిన వారు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకం కోసం ఖాళీ స్థలాలను ఉంచుకొని ఎదురు చూస్తున్నారు. మిగిలిన 28,511 గృహాలు, భవనాలు ఇంకా శిథిలావస్థకే చేరి కూలే దశలో ఉన్నాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి జిలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శిథిలమైన ఇళ్లలో ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. వాటిని కూల్చి నూతన నిర్మాణం చేసుకునే ఆర్థిక స్థోమత లేక అలాగే నివాసం ఉంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుండటం వల్ల శిథిల భవనాలు, నిర్మాణాల తొలగింపు పట్ల తగిన చర్యలు తీసుకోవటానికి అధికారులు వెనకంజ వేస్తున్నారు. భారాస హయాంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని చాలామందికి పంపిణీ చేయలేకపోయారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించడంతో 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని