logo

పారిశుద్ధ్య కార్మికులకు పెరిగిన పని భారం

జిల్లా ఆసుపత్రిలో రెండు ఏజెన్సీల మధ్యన పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 02 Jul 2024 03:06 IST

గుత్తేదారుల పంచాయతీతో కార్మికులకు ఇక్కట్లు

ఇటీవల ఆసుపత్రికి వచ్చిన మంత్రి జూపల్లికి తమ సమస్యలను చెప్పుకొంటున్న పారిశుద్ధ్య కార్మికులు

నాగర్‌కర్నూల్, న్యూస్‌టుడే : జిల్లా ఆసుపత్రిలో రెండు ఏజెన్సీల మధ్యన పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అతి తక్కువ వేతనంతో పాటు పని భారం పెరిగింది. సమస్యను పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల జిల్లా ఆసుపత్రికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు మొరపెట్టుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో సేవలందించే కార్మికులు ప్రైవేట్‌ ఏజెన్సీల కింద పనిచేస్తారు. ఏజెన్సీలే కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. నాలుగేళ్ల క్రితమే జిల్లా ఆసుపత్రిని వంద పడకల నుంచి 330 పడకలకు పెంపుదల చేశారు. మరోవైపు వైద్య విధాన పరిషత్‌ కింద ఉన్న జిల్లా ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుబంధంగా మార్పు చేశారు. దీంతో రోగుల సంఖ్య పెరిగింది. వైద్య కళాశాల రావడంతో వైద్యుల సంఖ్య అధికమైంది. కానీ జిల్లా ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగలేదు. ఇప్పుడు పనిచేసే కార్మికులకు పెరిగిన వేతనాలు కాకుండా కేవలం రూ.7,600 మాత్రమే చెల్లిస్తున్నారు. కార్మికులకు కొత్త జీవో ప్రకారం ప్రకారం రూ.15వేలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ అది అమలు కావడం లేదు. ఆసుపత్రిలో పనులు చేయించే రెండు ఏజెన్సీలు కోర్టుకు వెళ్లాయి. వివాదం కోర్టులో ఉందని కార్మికులకు పాత వేతనాలే చెల్లిస్తున్నారు.

కార్మికులపై పెరిగిన పని భారం.. : జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న దానికి 100 నుంచి 140 మంది కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, శానిటేషన్‌ పనులు చేయించాల్సి ఉంటుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది. 140 మంది పని చేయాల్సిన చోట కేవలం 30 మందితో పనులు చేయిస్తున్నారు. దీంతో ఉన్నవారిపై పని భారం విపరీతంగా పెరిగింది. మా గోడును పట్టించుకోండంటూ ఆసుపత్రికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కార్మికులు మొర పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 33 మంది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. కానీ 26 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉన్న వారితో నెట్టుకొస్తున్నారు. ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. కొద్ది రోజుల్లోనే కోర్టులో ఉన్న వివాదం అయిపోతుందని, ఆ తర్వాత కొత్తగా కార్మికులను తీసుకుంటామని జిల్లా ఆసుపత్రి అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని