logo

అయ్యో! పేట

ఏ ఒక్క మండలంలోనూ ఎంఈవోలు లేని జిల్లాగా అరుదైన రికార్డును నారాయణపేట సొంతం చేసుకుంది.

Published : 02 Jul 2024 03:05 IST

ఒక్క ఎంఈవో లేని జిల్లా

మంత్రోనిపల్లిలో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో టిఫిన్లు తెచ్చుకున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌: ఏ ఒక్క మండలంలోనూ ఎంఈవోలు లేని జిల్లాగా అరుదైన రికార్డును నారాయణపేట సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థలో జిల్లాస్థాయి పర్యవేక్షణకు డీఈవో, మండల స్థాయిలో పర్యవేక్షణకు ఎంఈవో(మండల విద్యాధికారి) ఉంటారు. ప్రస్తుతం జిల్లాలో 13 మండలాలు ఉండగా, ఈ నెల నుంచి ఏ ఒక్క మండలంలోనూ రెగ్యులర్‌ ఎంఈవో లేకుండా పోయారు. గత నెలాఖరు వరకు ఊట్కూరు మండల విద్యాధికారిగా ఉన్న వెంకటయ్య గత నెలాఖరున పదవీ విరమణ చేయడంతో ఈ  పరిస్థితి తలెత్తింది.
జిల్లాలో ఉన్న ఏకైక రెగ్యులర్‌ ఎంఈవో వెంకటయ్య ఊట్కూరుతో పాటు నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలకు ఇన్‌ఛార్జిగా ఉండేవారు. ప్రస్తుతం ఆ అయిదు మండలాలు ఇన్‌ఛార్జిలు లేని అనాథలయ్యాయి. కోస్గి, నారాయణపేట జీహెచ్‌ఎంలు అంజలీదేవి, గోపాల్‌నాయక్‌ బదిలీపై వెళ్లక ముందు ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా పనిచేశారు. అంజలీదేవి కోస్గితో పాటు ధన్వాడ, మరికల్‌ మండలాలకు ఇన్‌ఛార్జి. ఈమె బదిలీలో భాగంగా కొన్ని నెలల కిందట మహబూబ్‌నగర్‌ వెళ్లారు. గోపాల్‌నాయక్‌ దామరగిద్ద, నారాయణపేట, మద్దూరు మండలాల ఇన్‌ఛార్జి. ఈయన కొన్ని నెలల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వేపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. వేరే జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడ ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా ఏం చేస్తారో అర్థంకాని పరిస్థితి. ఉన్నతాధికార యంత్రాంగం అక్కడ, ఇక్కడ వేరుగా ఉండటంతో జవాబుదారీ ఎలా సాధ్యమన్నది ప్రశ్న.

నోడల్‌ అధికారుల సేవలు అంతంతే!

ప్రభుత్వం క్లస్టర్‌ జీహెచ్‌ఎంలను మండల నోడల్‌ అధికారులుగా నియమించినా వారికి తమ పాఠశాల బాధ్యతల్ని చూసుకునేందుకే సమయం సరిపోవడంలేదు. వీరు తమ క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ కూడా వారికి కష్టమే. అలాంటిది ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారంటే అత్యాశే. ప్రస్తుతం జిల్లాలో పర్యవేక్షణ కొరవడి కొన్ని బడుల్లో సిబ్బంది ఆడిందే ఆటగా మారింది. పర్యవేక్షణ పకడ్బందీగా ఉన్న సమయంలోనే మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లని సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం అడిగే వారే లేకపోవడంతో చదువులు దైవాధీనం... పిల్లల అదృష్టంలా మారింది. ఉదాహరణకు ధన్వాడ మండలం మంత్రోనిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలిస్తే ఇక్కడ ఉపాధ్యాయుడు, వంట ఏజెన్సీ ప్రతినిధికి మధ్య తలెత్తిన పేచీ మూలంగా మధ్యాహ్న భోజనం ఆగిపోయింది. ఎంఈవో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇకనైనా ప్రభుత్వం జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని