logo

భూమి సర్వే చేయాలని రైతు ఆత్మహత్యాయత్నం

భూమి కబ్జా చేసి ధరణిలో పేర్లు నమోదు చేసుకున్నారని, సర్వే చేసి హద్దులు చూపాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు పరశురాముడు కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Published : 02 Jul 2024 02:52 IST

ప్రజావాణి హాల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న రైతు

గద్వాల కలెక్టరేట్, న్యూస్‌టుడే : భూమి కబ్జా చేసి ధరణిలో పేర్లు నమోదు చేసుకున్నారని, సర్వే చేసి హద్దులు చూపాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు పరశురాముడు కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో పోలీసులు, సిబ్బంది అడ్డుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయిజ మండలం యాపదిన్నె శివారులోని గుడిదొడ్డి గ్రామానికి చెందిన బాధితుడి తండ్రి వడ్డె సవారన్నకు ఓ సర్వే నంబర్‌లో 1986లో ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. బాధితుల కథనం మేరకు.. సవారన్న మృతి చెందగా వారసత్వంగా ముగ్గురు కుమారులు అయిన పరశురాముడు, తిమ్మప్ప, కృష్ణ పేరున ఖాతా మార్పు చేయాలని కొన్నేళ్లుగా అయిజ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జీవనోపాధి కోసం కడప ప్రాంతానికి వలస వెళ్లామని, తిరిగి గ్రామానికి చేరుకున్నామని చెప్పారు. వారసత్వంగా కుటుంబానికి సంక్రమించాల్సిన భూమిని రాజకీయ అండదండలున్న గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు కబ్జా చేసి వారి పొలంలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఓ సారి సర్వే అధికారులు వచ్చినా బడా రాజకీయ నేత బెదిరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప సర్వే చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలతో సహా కలెక్టర్‌కు తమ గోడును విన్నవించుకోవడానికి ఇక్కడకు వచ్చామని, ఆవేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడి సోదరులు తిమ్మప్ప, కృష్ణ చెప్పారు. భూమి సర్వే చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంతో ప్రజావాణి నిర్వహించే హాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

భూ సమస్య పరిష్కరించాలని మహిళ..

పెట్రోల్‌ ఒంటిపై పోసుకొనేందుకు యత్నిస్తున్న జయమ్మను వారిస్తున్న డీటీ పట్టాభి

లింగాల, న్యూస్‌టుడే: భూ సమస్య పరిష్కరించాలంటూ రెవెన్యూ కార్యాలయం ఎదుట గాలేటి జయమ్మ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం లింగాలలో చోటు చేసుకొంది. అధికారులు న్యాయం చేయలంటూ పెట్రోల్‌ ఉన్న బాటిల్‌తో జయమ్మ ఆందోళన చేపట్టింది. విషయాన్ని గమనించిన ఉప తహసీల్దారు పట్టాభి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగాల శివారులోని ఓ సర్వే నంబరులో 1.37 ఎకరాలకు సంబంధించి సాగు చేస్తున్న భూమిని ఇతరులకు పట్టా చేయటంపై రెవెన్యూ, కలెక్టరు కార్యాలయాల్లో పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని