logo

పులకించిన పెద్దపోతులపాడు

మారుమూల గ్రామంలో, ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, బ్యాంకింగ్‌ రంగంలోనే అత్యున్నతమైన ఎస్బీఐ ఛైర్మన్‌ పదవికి ఎంపికవడమంటే సాధారణ విషయం కాదు.

Published : 01 Jul 2024 06:27 IST

పాలమూరు వాసిని వరించనున్న ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి

గ్రామంలో ఎస్బీఐ సంజీవని వాహనాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాసులు శెట్టి

మానవపాడు, న్యూస్‌టుడే: మారుమూల గ్రామంలో, ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, బ్యాంకింగ్‌ రంగంలోనే అత్యున్నతమైన ఎస్బీఐ ఛైర్మన్‌ పదవికి ఎంపికవడమంటే సాధారణ విషయం కాదు. గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి ఆ ఘనతను సాధించనుండటంతో గ్రామస్థులు పులకించి పోతున్నారు.

కుటుంబం, విద్యాభ్యాసం..: పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన లింగయ్య, లక్ష్మిదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా శ్రీనివాసులు శెట్టి చివరివాడు. 1966లో జన్మించారు. 1 నుంచి 7వ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు గద్వాలలో చదివారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివారు. 1988లో ఉద్యోగంలో చేశారు. వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు శ్రీచరణ్, శ్రీకర్‌ ఉన్నారు.

పుట్టినగడ్డకు..: చల్లా శ్రీనివాసులు శెట్టి ఉద్యోగంతో పాటు సామాజిక సేవల్లో కూడా చురుకుగా పాల్గొనేవారు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట స్వగ్రామమైన పెద్దపోతులపాడులో ఎస్బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్‌ వెల్‌నెస్‌ యూనిట్‌ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా వైద్యులు, సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. గద్వాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవసరమైన ఫర్నిచర్, మౌలిక వసతులను సమకూర్చారు. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు, టీవీ, ఇతర ఫర్నిచర్‌ను వితరణ చేశారు.


గర్వంగా ఉంది: శ్రీనివాసులుశెట్టిని ఎస్బీఐ తదుపరి ఛైర్మన్‌గా ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సు చేయడం సంతోషంగా ఉంది. నేను ఆయనతో పాటు పెద్దపోతులపాడు గ్రామంలో 1 నుంచి 7వ తరగతి వరకు కలిసి చదువుకున్నాను. తన స్నేహితుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.

ఎల్కూరు సోమశేఖర్‌రెడ్డి, ఏడో తరగతిలో సహ విద్యార్థి


ప్రతిభ కనబరిచేవారు: సంగాల గ్రామానికి చెందిన నేను శ్రీనివాసులు శెట్టితో కలిసి గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఆయన చదువులో మంచి ప్రతిభ కనబరిచే వారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో, సహచర విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. క్రమశిక్షణ, లక్ష్యంతో చదవడం వల్ల నేడు ఈ స్థితిలో ఉన్నారు. 

అయ్యపురెడ్డి, పదో తరగతిలో సహ విద్యార్థి


గ్రామాభివృద్ధికి కృషిచేయాలి : శ్రీనివాసులుశెట్టి వల్ల గ్రామం పేరు దేశస్థాయిలో వినిపిస్తున్నందుకు గ్రామస్థులమంతా గర్వపడుతున్నాం. ఎస్బీఐలో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేయాలని కోరుతున్నాం. అలంపూర్‌ చౌరస్తాలో బ్యాంకు శాఖ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. 

జమ్మన్న, పెద్దపోతులపాడు గ్రామం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని