logo

ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించటమెలా?

రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఖరీఫ్‌కు సంబంధించిన సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)ను ఎఫ్‌సీఐకి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయటంతో ఉమ్మడి జిల్లాలోని కొందరు మిల్లర్లకు ఆందోళన మొదలైంది.

Updated : 01 Jul 2024 06:22 IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల తర్జన భర్జన 
ఇప్పటికే నల్లబజారుకు చాలా మిల్లుల ధాన్యం

వనపర్తి జిల్లాలోని ఓ మిల్లులో సీఎంఆర్‌ లేకపోవడంతో ఆరా తీస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందం

ఈనాడు, మహబూబ్‌నగర్, వనపర్తి న్యూటౌన్, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఖరీఫ్‌కు సంబంధించిన సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)ను ఎఫ్‌సీఐకి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయటంతో ఉమ్మడి జిల్లాలోని కొందరు మిల్లర్లకు ఆందోళన మొదలైంది. సెప్టెంబరు 30 లోపు పూర్తి స్థాయిలో సీఎంఆర్‌ను అప్పగించాల్సి ఉండగా ఇప్పటికే పలువురు మిల్లర్లు సీఎంఆర్‌ను అక్రమంగా తమిళనాడు, కర్ణాటక, ఏపీకి తరలించి సొమ్ము చేసుకున్నారు. వారంతా ఎలాగైనా ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలని రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. 

బెడిసికొట్టిన ప్రయత్నం..

గత ఖరీఫ్‌ సీఎంఆర్‌ చాలా మిల్లర్ల వద్ద ప్రస్తుతం లేదు. గతంలో మిల్లర్లు సీఎంఆర్‌ను నల్లబజారుకు తరలించినా ఇతర మార్గాల ద్వారా ఎఫ్‌సీఐకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం అప్పగించేవారు. రేషన్‌ దుకాణాలు, ప్రజల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి రీసైక్లింగ్‌ చేసి అందించేవారు. అప్పగించింది సీఎంఆరా.., పీడీఎస్‌ బియ్యమా అనేది తనిఖీ చేయకుండా కొందరు అధికారులు సహకరించేవారు. ఈసారి సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పటంతో మిల్లర్లకు చుక్కెదురైంది. ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ అప్పగిస్తే నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తారు. పాత బియ్యమే రీసైక్లింగ్‌ చేసినట్లు తేలితే తిరస్కరిస్తారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వనపర్తి జిల్లాలో నాలుగు మిల్లుల సీఎంఆర్‌ను నిర్మాణంలో ఉన్న ఓ మిల్లుకు బదిలీచేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై ‘ఈనాడు’లో కథనం రావడంతో బదిలీ ఉత్తర్వులు ఆపేశారు. ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన పరిస్థితిని తప్పించేందుకే మిల్లుల్లో ధాన్యం లేకపోయినా బదిలీ ఉత్తర్వులు ఇప్పించుకున్నారు. మిగతా మిల్లర్లు ఇదే చేయాలనుకున్నా బెడిసి కొట్టడంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. 

అన్నిచోట్ల తనిఖీ చేస్తే..

మూడు రోజుల కిందట వనపర్తి జిల్లాలోని రెండు మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందం, జిల్లా అధికారులు తనిఖీలు చేయగా రెండింటా అక్రమాలు వెలుగుచూశాయి. ఒక మిల్లులో 9,259 మెట్రిక్‌ టన్నులు, మరో మిల్లులో స్వల్పంగా ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.30కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. భారీగా ధాన్యం లేని రైస్‌ మిల్లు యజమానిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అన్ని మిల్లుల్లో దాడులు చేస్తే పెద్ద ఎత్తున మోసాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పౌర సరఫరాల శాఖ మేనేజర్లు ఇర్ఫాన్, ప్రవీణ్, బాలరాజులను ‘ఈనాడు’ సంప్రదించగా మిల్లుల్లో తనిఖీలు చేసి నిల్వ లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాల వారీగా పరిస్థితిదీ

ప్రభుత్వం గతేడాది ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలోని 321 మిల్లులకు 3,81,024 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించింది. గడువులోగా 2,55,376 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ఎఫ్‌సీఐకి అందించాలి. మిల్లర్లు ఇప్పటివరకు 73,587 మెట్రిక్‌ టన్నులు (28.81 శాతం) మాత్రమే అందించారు. మిగతా 1,81,789 మెట్రిక్‌ టన్నులు (71.18 శాతం) అప్పగించాల్సి ఉంది. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 83.79 శాతం, వనపర్తిలో 81.70, మహబూబ్‌నగర్‌లో 50.98, నారాయణపేటలో 39.23, జోగులాంబ గద్వాలలో 23.58 శాతం సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని