logo

అందని అల్పాహారం

గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ కడుపుతో ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల్లో శారీరక బలహీనతను, ఆకలితో అలమటిస్తూ చదువుపై ఆసక్తి తగ్గే పరిస్థితిని అధిగమించేందుకు భారాస ప్రభుత్వం దసరా కానుకగా గత ఏడాది

Published : 01 Jul 2024 05:45 IST

ఆత్మకూరు వడ్డేవీధి పాఠశాలలో అల్పాహారం తింటున్న విద్యార్థులు (పాతచిత్రం)

ఆత్మకూరు, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ కడుపుతో ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల్లో శారీరక బలహీనతను, ఆకలితో అలమటిస్తూ చదువుపై ఆసక్తి తగ్గే పరిస్థితిని అధిగమించేందుకు భారాస ప్రభుత్వం దసరా కానుకగా గత ఏడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ పథకం అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అక్కడ పర్యటించి పథకం అమలుకు ప్రణాళిక తయారు చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పాఠశాల వేళలకు ముందే అల్పాహారం అందించేందుకు మార్గదర్శకాలు రూపొందించారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విస్తరించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అమలు చేసిన పాఠశాలల్లో ఏజెన్సీలకు బిల్లుల బకాయి వేధిస్తోంది. ఈ ఏడాది పథకం అటకెక్కింది.

మండలంలో ఒక పాఠశాల: ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’ మొదటి దశ కింద ప్రతి మండలంలో ఒక పాఠశాలలో అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకం అమలుకు రూ.52 కోట్లు వ్యయం చేయాల్సిన పరిస్థితిపై విద్యాశాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో 2,833 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా గత విద్యా సంవత్సరం 3.20 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ప్రత్యేక మార్గదర్శకాలు: అప్పట్లో విద్యాశాఖ కార్యదర్శి కరుణ వారం రోజుల పాటు ప్రతి రోజూ విద్యార్థులకు ఇవ్వాల్సిన అల్పాహారం వివరాలను ప్రకటించారు. పొంగలి, కిచిడి, సేమియా ఉప్మా, రవ్వ లేదా ఉప్మాతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతో అల్పాహారం అందించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకే వీటి బాధ్యతలను అప్పగించారు. వంటపాత్రలను సమకూర్చేందుకు నిర్దేశించారు. దశల వారీగా ఇడ్లీ, పూరీ, వడ వంటి అల్పాహారాన్ని అందించేందుకు ప్రత్యేక వంట పాత్రలను సమకూర్చనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. అల్పాహారం సిద్ధం చేసే ఏజెన్సీలకు ప్రత్యేక పారితోషికాన్ని ప్రకటించి, రెండు నెలల పాటు అమలుపర్చారు.


ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..: గత ఏడాది అక్టోబరు 26వ తేదీ నుంచి ఆత్మకూరు వడ్డేవీధి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించాం. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు పెరిగాయి. మధ్యాహ్న భోజనం వండి పెడుతుండటంతో అల్పాహారం అందించేందుకు సిద్ధమయ్యాం. మొదటి రెండు నెలల బిల్లులు మాత్రమే చెల్లించారు. విద్యా సంవత్సరం ముగిసినా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

మణెమ్మ, ఏజెన్సీ సభ్యురాలు, ఆత్మకూరు


ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలి : గత విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రతి మండలంలో ఒక పాఠశాలలో అల్పాహార పథకం అమలు చేశాం. మొదటి రెండు నెలలు పథకం అమలుకు సహకరించిన మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు బిల్లులు చెల్లించినట్లు సమాచారం ఉంది. కొన్ని మండలాల్లో గత విద్యా సంవత్సరం బిల్లుల బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది.

గోవిందరాజులు, డీఈవో, వనపర్తి జిల్లా 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని