logo

వైకుంఠధామాలనూ వదలట్లేదు!

ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమో మరణించిన తరువాత ఖననం చేసేందుకు కొంత స్థలం అవసరం వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Published : 01 Jul 2024 05:42 IST

పంచదేవ్‌పహాడ్‌లో చదును చేయడానికి సిద్ధంగా శ్మశానవాటిక 

న్యూస్‌టుడే-మక్తల్‌ గ్రామీణం: ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమో మరణించిన తరువాత ఖననం చేసేందుకు కొంత స్థలం అవసరం వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అనేక గ్రామాల్లో శ్మశానవాటికలకు హద్దులు ఏర్పాటు చేస్తున్నా కబ్జాదారులు వాటిని తొలగించి అక్రమాలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల క్రితం ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు గుర్తించి ఎకరం, రెండు, మూడు ఎకరాల వరకు ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో హద్దులు ఏర్పాటు చేసి వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క శ్మశానానికి రూ.12.60లక్షలు ఖర్చుచేసి నిర్మాణాలు చేపట్టారు. అందులో రెండు స్నానపుగదులు, విశ్రాంతి హాల్, పూజకట్ట, ముఖద్వారం, దహనం చేసేందుకు రెండు కట్టలు నిర్మించడంతోపాటు విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించారు. కొన్ని ప్రదేశాల్లో రక్షణగోడ నిర్మాణాలు చేపట్టగా, అనేక గ్రామాల్లో నిర్మించలేదు. దీంతో కబ్జాదారులు దర్జాగా చదునుచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. 

  • కోస్గి పట్టణంలోని చెన్నారం రహదారిలో శ్మశాన వాటిక స్థలం అర ఎకరాకు పైగా కబ్జాకు గురైంది. ఇక్కడ ఖననం చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
  • మక్తల్‌ మండలం కర్నిలో ఎకరం 30 గుంటలు శ్మశాన వాటికకు కేటాయించారు. అందులో పది గుంటలకుపైగా కబ్జాకు గురైనట్లు గ్రామస్థులు అంటున్నారు. పంచదేవ్‌పహాడ్‌లో మూడు ఎకరాల పది గుంటల స్థలాన్ని కేటాయించారు. అందులో శ్మశాన వాటికకు రెండు ఎకరాలు, పల్లె ప్రకృతి వనానికి ఎకరం, నర్సరీకి పది గుంటల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరానికి పైగా కబ్జాకు గురైంది. ఈ స్థలంలో గత ఏడాది హరితహారంలో భాగంగా 800 మొక్కలు నాటారు. రాత్రి వేళలో బడా నాయకుడు మొక్కలు తొలగించి కబ్జా చేసుకున్నారు. గుడిగండ్లలో శ్మశాన వాటికకు రెండు ఎకరాల భూమిని కేటాయించారు. అందులో ఎకరాకుపైగా స్థలం ఆక్రమణకు గురైంది. ఓ రైతు పంట సాగు చేస్తున్నాడు. జక్లేర్‌లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో చెరువులో శ్మశాన వాటిక నిర్మించారు. చెరువు నిండితే శ్మశానవాటిక నీటిలో మునిగి ఉంటుంది. 
  • నారాయణపేటలోని యాదవనగర్‌ రహదారిలో ఎస్సీవాడ శ్మశానవాటికకు రెండు ఎకరాలు కేటాయించారు. కొందరు రియల్‌ వ్యాపారులు స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. స్థానిక అధికారులు, నాయకుల అండతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అర ఎకరం కబ్జాకు గురైంది. వీటితోపాటు అనేక గ్రామాల్లో శ్మశాన వాటిక స్థలాలు కబ్జా చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని కబ్జాలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యలు తప్పవు..
- అశోక్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టరు(రెవెన్యూ), నారాయణపేట
 

వైకుంఠధామాల స్థలాలను సర్వే చేయిస్తాం. ఆక్రమణలు తొలగిస్తాం. అప్పటికీ ఆక్రమణదారులు స్థలాలను వదలకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ ఉద్దేశంతో వైకుంఠధామాలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యానికి విఘాతం కలగనివ్వం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని