logo

కొత్త చట్టాలతో సత్వర న్యాయం

బ్రిటీష్‌ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. వీటితో బాధితులు సత్వర న్యాయం పొందే వీలుందని, దోషులకు విధించే శిక్షలతో పాటు జరిమానాలు

Updated : 01 Jul 2024 06:25 IST

అమలుకు సిద్ధమైన ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం

పాలమూరులో పోలీసులకు కొత్త చట్టాలపై శిక్షణ ఇస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం : బ్రిటీష్‌ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. వీటితో బాధితులు సత్వర న్యాయం పొందే వీలుందని, దోషులకు విధించే శిక్షలతో పాటు జరిమానాలు గణనీయంగా పెరిగాయని న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. నూతన చట్టాల అమలుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాం గం సిద్ధమైంది. నెల రోజులుగా 14 బ్యాచ్‌లుగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయటంతో పాటు తీర్పులు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఆసక్తికర విషయాలు తెలిపారు. 

మార్పు ఇలా.. 

  • చిన్న నేరాలకు జరిమానాలు బాగా పెరగనున్నాయి. ప్రస్తుతం చిన్న ప్రమాదానికి బాధ్యులైన వారికి రూ.500 జరిమానా ఉండేది. ఇప్పుడు రూ.5వేలకు పెరిగింది. ఘర్షణ కేసుల్లో చేతులతో కొడితే రూ.1,000 జరిమానా విధించేవారు. రూ.10వేలకు పెంచారు. కర్రలతో దాడిచేస్తే రూ.1,000 ఉన్న జరిమానా రూ.20వేలకు పెరిగింది. జైలు శిక్ష కూడా పడుతుంది. 
  • ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో ఏవైనా సందేహాలు ఉంటే డీఎస్పీ అనుమతితో మళ్లీ దర్యాప్తు చేయొచ్చు. కేసును 14 రోజుల లోపల విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైతే కేసును బలంగా నమోదు చేయొచ్చు. ఆధారాలు లభ్యం కాకపోతే ఆ కేసును మూసివేయొచ్చు. 
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దేశంలోని ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు, ఏ నేరం జరిగినా బాధితులు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. ఆ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది బాధితులకు రక్షణ కల్పించి అండగా నిలుస్తారు. దర్యాప్తు చేసి స్టేట్‌మెంట్లను రికార్డు చేసి బాధితులు నివసించే ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌కు అంతర్జాలం ద్వారా కేసు బదిలీ చేస్తారు. 
  • 33 కేసుల్లో శిక్షలు పెరిగాయి. గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 83 నేరాల్లో రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయి. బాధితులు వైద్యచికిత్స చేయించడానికి అయ్యే ఖర్చు దోషి నుంచే రాబట్టాలని కొత్త చట్టం చెబుతోంది. 
  • రహదారులపై వాహనాలను గుర్తు తెలియని వాహనదారులు ఢీకొట్టి వెళ్తుంటారు. అలా వెళ్లిన వారికి ఇక నుంచి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనదారులు సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ప్రమాదం వివరాలను చెప్పిన వారికి, ఘటనా స్థలంలో ఉండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి వేసే శిక్ష తీవ్రత తగ్గుతుంది. అలాంటి వారికి స్టేషన్‌ బెయిల్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. 
  • ప్రస్తుతం కలెక్టర్లకు జిల్లా, ఆర్డీవో డివిజన్, తహసీల్దార్లకు మండల మేజిస్ట్రేట్‌గా అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం జిల్లా ఎస్పీలకు స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌గా అధికారాలు రానున్నాయి. దీనివల్ల కొన్ని కేసుల్లో నేరుగా ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎస్పీకి రానుంది. 
  • రూ.5వేల లోపు దొంగతనాలు చేసిన వారికి, చిన్న చిన్న నేరాలు చేసిన వారికి, ప్రభుత్వ ఆధికారులతో వాగ్వాదానికి దిగి విధులకు ఆటంకం కల్పించిన వారికి రహదారులు, పురపాలికలు, అనాథ శరణాలయాల్లో సామాజిక సేవలు అందించేలా తీర్పు ఇవ్వనున్నారు. 

సదస్సులు నిర్వహిస్తాం.. : జులై 1 నుంచి కొత్త చట్టాల ప్రకారమే పోలీసులు పౌరులకు సేవలు అందించాల్సి ఉంటుంది. కొత్త చట్టాలపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు, యువకులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం. 

పి.వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్‌ డీఎస్పీ   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని