logo

ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులకు ఏర్పాట్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా ఎస్జీటీలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు సోమవారం ఉదయం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 01 Jul 2024 05:36 IST

నేడు కొత్త స్థానాల్లో చేరేలా ఆదేశాలు 

సముదాయ పాఠశాల సమావేశంలో పాల్గొన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు (పాత) 

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా ఎస్జీటీలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు సోమవారం ఉదయం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బదిలీ కోసం వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్న ఉపాధ్యాయులు అర్ధరాత్రి నుంచే వెబ్‌ ఆప్షన్లు పెట్టుకున్నారు. కంప్యూటర్లు లేని వారు ఆప్షన్లను కాగితాలపై రాసుకొని ఇంటర్నెట్‌ కేంద్రాలకు పరుగెత్తి ప్రాధాన్యతా క్రమంలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి తంటాలు పడ్డారు. ఒక్కొక్కరు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి 30-45 నిమిషాలు పట్టింది. రాత్రి సమయంలో కూడా ఇంటర్నెట్‌ కేంద్రాల వారిని అందుబాటులో ఉంచుకొని ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. సమయం తక్కువగా ఇచ్చారని ఎస్జీటీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఏల బదిలీలు, పదోన్నతుల సమయంలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండటంతో ఆప్షన్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఎదురు కాలేదు. 

ఇప్పటికే 3,929 మందికి స్థాన చలనం : ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 1,725 మంది ఎస్‌ఏలకు బదిలీ అయ్యారు. మరో 1,975 మంది ఎస్జీటీలు ఎస్‌ఏలుగా, 229 మంది ఎస్‌ఏలు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3,929 మంది ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఎస్జీటీల బదిలీలతో మరో రెండు వేల మందికి స్థాన చలనం కలగనుంది. ఒకే పాఠశాలలో 8 ఏళ్ల పాటు పనిచేసిన ఎస్జీటీలు విధిగా మరో పాఠశాలకు బదిలీ కానున్నారు. 8 ఏళ్లలోపు వారు కోరుకుంటే తప్ప వారికి బదిలీ ఉండదు. ఆప్షన్లలో వారికి ఆసక్తి ఉన్న కొన్ని పాఠశాలలను నమోదు చేసి తరువాత ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల పేరు చివరన పెడతారు. మరో అనుకూలమైన స్థానం లభిస్తే బదిలీ అవుతారు లేకపోతే ప్రస్తుత పాఠశాలలనే కొనసాగుతారు. 

వెంటనే  చేరేలా ఆదేశాలు : బదిలీకి అర్హులైన ఉపాధ్యాయులు ఆదివారం రాత్రి 10 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వగా రాత్రి 11.59 గంటల వరకు ఎడిట్‌ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీల్లో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, తెలుగు, ఉర్దూ, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్, సంగీతం తదితర విభాగాలకు చెందిన ఎస్జీటీ స్థాయి వారిని బదిలీ చేయనున్నారు. బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు ఆదివారం మధ్యాహ్నం పాత స్థానాల నుంచి విడుదలై సోమవారం ఉదయం కొత్త స్థానాల్లో చేరేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని