logo

ప్రైవేటులో అనుచితం

నిరుపేద విద్యార్థి నర్సింహ చదువులో రాణిస్తున్నాడు. వాడిని మంచి కార్పొరేట్‌ పాఠశాలలో చదివిస్తే ఇంకా రాణిస్తాడని తండ్రి ఆశ. ప్రైవేటు పాఠాశాలలో చేర్పించటానికి వెళ్లాడు.

Updated : 01 Jul 2024 06:24 IST

నిరుపేదలకు దక్కని 25 శాతం ఉచిత సీట్లు 

నిరుపేద విద్యార్థి నర్సింహ చదువులో రాణిస్తున్నాడు. వాడిని మంచి కార్పొరేట్‌ పాఠశాలలో చదివిస్తే ఇంకా రాణిస్తాడని తండ్రి ఆశ. ప్రైవేటు పాఠాశాలలో చేర్పించటానికి వెళ్లాడు. ప్రవేశ పరీక్ష పెట్టిన పాఠశాల యాజమాన్యం చదువులో మీ అబ్బాయి మంచిగా రాణిస్తున్నాడు మా పాఠశాలలో చేర్పించండన్నారు. సార్‌ ప్రభుత్వం 25 శాతం సీట్లు నిరుపేదలకు కేటాయించాలని నిబంధన ఉంది కదా దాని ప్రకారం మా వాడిని చేర్చుకోండి అన్నాడు తండ్రి. అప్పటి వరకు చదువులో రాణిస్తున్నాడని అన్న యాజమాన్యం వెంటనే మాట మార్చి మా దగ్గర ఇప్పటికే పరిమితికి మించి ఆ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నాం, ఇక చేర్చుకోలేమంటూ చెప్పి వారిని వెనక్కు పంపించేశారు.  

ధరూరు, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యలో 25 శాతం సీట్లు నిరుపేదలకు, దివ్వాంగులకు కేటాయించి ఉచిత విద్యను అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వాటి అమలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. నిరుపేద విద్యార్థులతో కూడా నిర్ణీత ఫీజులు వసూలు చేస్తున్నారు. అది కూడా నాన్‌ రెసిడెన్సియల్‌ అయితే రూ.వేలల్లో రెసిడెన్సియల్‌ అయితే రూ.లక్షల్లోనే వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ అన్నది ప్రభుత్వ పరిధిలో లేకపోవటం. పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే ప్రైవేటుకే వత్తాసు పలకటం. వెరసి పరిస్థితి ఇలా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. 

ఉచితం ఇవ్వాల్సిందిలా..: ఇక 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యలో 25 శాతం సీట్లు ఉచితంగా నిరుపేదలకు ఇవ్వాల్సి వస్తే అందులో ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 4 శాతం, బీసీలకు 4 శాతం నిరుపేదలు దివ్యాంగులకు కలిపి మిగిలినవి కేటాయించాలి. ఉమ్మడి జిల్లాలో 850 వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటి పరిధిలో 2.37 లక్షల మంది విద్యార్థులు చదువులు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఒక్కో పాఠశాలలో కనిష్ఠంగా 200 నుంచి గరిష్ఠంగా 1,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తే దాదాపు 60 వేల మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందే అవకాశం ఉంటుంది.

అధికారులేంచేస్తున్నారు: ఇక ప్రైవేటు పాఠశాలల తనిఖీలకు ప్రారంభ సమయంలో అధికారులు వెళ్తుంటారు. రికార్డుల్లో మాత్రం నిరుపేదలకు నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించినట్లుగా చూపిస్తున్నారు. తర్వాత వారి నుంచి యథావిధిగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. తమకు రికార్డుల్లో ఉచిత విద్య అందుతున్న విషయం విద్యార్థులకు గానీ వారి తల్లిదండ్రులకు గానీ తెలియకుండా యాజమాన్యాలు జాగ్రత్తపడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షించి అసలు ఉచిత విద్య అందిస్తున్న విద్యార్థుల జాబితాను బహిర్గతం చేస్తే ప్రైవేటు పాఠశాలల ఉచితం ఎంత శాతం అనేది బయటపడుతుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. 

నిబంధనలు అమలు చేస్తాం: నిబంధనల ప్రకారం ప్రైవేటులో ఉచితంగా 25 శాతం సీట్లు నిరుపేదలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేపట్టి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం 

ఇందిర, జిల్లా విద్యాధికారిణి, జోగులాంబ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని