logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

శాంతినగర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన హరిజన సోమన్న అలియాస్‌ సంశాన్‌(20) ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం..

Published : 01 Jul 2024 05:27 IST

సోమన్న

వడ్డేపల్లి, న్యూస్‌టుడే: శాంతినగర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన హరిజన సోమన్న అలియాస్‌ సంశాన్‌(20) ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం.. బీటెక్‌ మూడో సంవత్సరం పూర్తి చేసిన యువకుడు హైదరాబాద్‌లో ర్యాపిడో బైకర్‌గా ద్విచక్ర వాహనం మీద ప్రయాణికులను తరలిస్తూ ఉపాధి పొందుతున్నాడు. న్యూమలక్‌పేట సిగ్నల్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో కింద పడగా వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 


నీటి సంపులో పడి వృద్ధుడి మృత్యువాత

తెలకపల్లి, న్యూస్‌టుడే : సంపులో నీటిని తోడుతూ ప్రమాదవశాత్తు అందులో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. గడ్డంపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు(77) తన ఇంటి ఎదుట ఉన్న సంపులో నీటిని తోడుతున్నాడు. ప్రమాదవశాత్తు జారి సంపులో పడి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ లేరు. కొందరు చిన్నారులు సాయంత్రం గమనించి నాగర్‌కర్నూల్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఎస్సై నరేశ్‌ని వివరణ కోరగా.. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 


పరిశ్రమలో విద్యుదాఘాతంతో ఒకరు.. 

బాలానగర్, న్యూస్‌టుడే : ఓ పరిశ్రమలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన రమేశ్‌(38) గత 14 సంవత్సరాలుగా బాలానగర్‌ మండల కేంద్రంలోని ఓ పరిశ్రమలో పొక్లెయిన్‌ డ్రైవర్, ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం పరిశ్రమలో విద్యుత్తు రాకపోవడంతో స్తంభం దగ్గర టిప్పర్‌ పైకి ఎక్కి తీగలు సరిచేస్తుండగా షాక్‌కు గురై కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సీఐటీయూ నాయకులు, బంధువులు మృతదేహంతో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ నాగార్జునగౌడ్, ఎస్సైలు తిరుపాజీ, చంద్రమోహన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పడంతో శాంతింపజేశారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తిరుపాజీ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని