logo

ఎవరిని అడగాలి? తిరిగిరాని ధరణి స్లాట్‌ రద్దు సొమ్ములు

రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్‌ స్థానంలో ఒక కొత్త పోర్టల్‌ను తీసుకుని రావడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.

Updated : 30 Jun 2024 10:40 IST

గద్వాల కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్‌ స్థానంలో ఒక కొత్త పోర్టల్‌ను తీసుకుని రావడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేయడమా? లేక సంస్కరణలు చేపట్టి క్షేత్రస్థాయిలో భూ సమస్యలు తలెత్తకుండా పటిష్ఠమైన విధానాన్ని అమలులోకి తీసుకుని రావడమా? అనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌ ద్వారా భూ క్రయ, విక్రయాల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ల శాఖలకు నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు చాలా మంది అనివార్య పరిస్థితుల్లో రద్దు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీరందరికి ఫీజులు వారి ఖాతాకు తిరిగి జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు దానిపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ మొత్తం జిల్లాలో రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

కార్యాలయాల చుట్టూ తిరుగుతూ..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం మీ సేవలో ఆయా ప్రాంతాల్లో భూమి మార్కెట్‌ విలువలో 7.5 శాతం నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి ఒప్పందం ప్రకారం స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటారు. స్లాట్‌ కేటాయించిన రోజున సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో ఇరు వర్గాల సమక్షంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్‌ చివరి క్షణంలో వారసత్వ భూముల విషయంలో సమస్యలు తలెత్తడం, మిస్సింగ్‌ సర్వే నంబర్లు ఉండటం, ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు కనిపించకపోవడం, భూమి విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోతే రైతు చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి ఆయన ఖాతాలో జమ కావాల్సి ఉంది. అలా కాకపోవడంతో రైతులు తహసీల్దార్‌ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. 

అధికారులేమంటున్నారంటే

భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఆ తరువాత రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోకి చలానా సొమ్ములు జమ చేస్తుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. స్లాట్‌ రుసుములు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నాయి. స్లాట్‌ రద్దు చేసుకున్న వారికి తిరిగి అక్కడి నుంచే రావాల్సి ఉంటుంది. ఈ విషయం రెవెన్యూ శాఖకు సంబంధం లేదు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

ఎందుకు రద్దు చేశారో తెలియదు..

నాకు ఇటిక్యాల మండలం, షేక్‌ పల్లి గ్రామంలో 11.39 ఎకరాల భూమి ఉంది. అందులో 10 ఎకరాల భూమిని నా సమీప బంధువు పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఖాతా మార్పు చేయడం కోసం గతేడాది నిబంధనల ప్రకారం రూ.25,858లను మీ సేవలో చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాను. తహసీల్దార్‌ స్లాట్‌ను రద్దు చేశారు. స్లాట్‌ ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదు. స్లాట్‌ బుకింగ్‌ చేసిన సమయంలో చెల్లించిన సొమ్ములు ఇంత వరకు రాలేదు. 
రాముడు, షేక్‌పల్లి, ఇటిక్యాల మండలం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని