logo

ఇళ్లు కాదు..ఊళ్లు అన్నారు.. రూ.98.31 కోట్లు ఊడ్చేశారు

పశ్చిమ ప్రాంతంలో వలసలెక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్‌-3 కింద ఇళ్లు నిర్మించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించారు. ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు అదనంగా మరో రూ.35 వేలు చెల్లిస్తేనే నిర్మిస్తామని గుత్తేదారులు మెలిక పెట్టారు.

Published : 04 Jul 2024 03:44 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

గోడలకు పగుళ్లు

పశ్చిమ ప్రాంతంలో వలసలెక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్‌-3 కింద ఇళ్లు నిర్మించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించారు. ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు అదనంగా మరో రూ.35 వేలు చెల్లిస్తేనే నిర్మిస్తామని గుత్తేదారులు మెలిక పెట్టారు. అందుకు అప్పటి పాలనాధికారులు ఆమోద ముద్ర వేశారు. ఆలూరులో 410, చిప్పగిరి 232, ఆదోని అర్బన్‌ 5,007, హాలహర్వి 473, ఆదోని గ్రామీణం 768, కౌతాళం 441, మంత్రాలయం 870, గోనెగండ్ల 296, ఎమ్మిగనూరు అర్బన్‌ 1,018, కోసిగి 799, నందవరం 184, హొళగుంద 312, పెద్దకడబూరు 137, ఎమ్మిగనూరు గ్రామీణం 120, దేవనకొండ మండలంలో 31 ఇళ్లు నిర్మించే బాధ్యతను గుత్తేదారులకు అప్పగించారు.

ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు.. వైకాపా నేతలు, నాయకులు గుత్తేదారులుగా అవతారమెత్తారు... ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు అదనంగా మరో రూ.35 వేలు చెల్లించాలని డిమాండు చేశారు. అందుకు అప్పటి ప్రభుత్వం తలూపింది. సాధారణంగా నిర్మాణాలు పూర్తి చేస్తేనే నిధులు మంజూరు చేస్తుంటారు. గుత్తేదారులు వైకాపా నేతలు కావడంతో పనులు పూర్తి చేయకుండానే రూ.కోట్లు కుమ్మరించారు. రూ.98.31 కోట్లు సమర్పించినా 58 ఇళ్లే పూర్తి చేశారు. ఇందులో 18 సంస్థలకు రూ.91.83 కోట్లు ముట్టాయి.. ఒక్క ఇల్లూ పూర్తి చేయకపోవడం గమనార్హం.

కుంగిన పునాది

గుత్తేదారులకు సమర్పించారు

ఆప్షన్‌-3 కింద ఇళ్ల నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న గుత్తేదారులంతా వైకాపా అనుయాయులే. గతేడాది సెప్టెంబరు నాటికి 17 మంది గుత్తేదారులకు 11,119 ఇళ్లు నిర్మించే బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత మరో ఐదుగురు గుత్తేదారులు వచ్చి చేశారు. ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని 10,595 వరకు కుదించారు. ఇంటిని పిల్లర్లతో నిర్మించాలి. ముందు భాగంలో ప్లాస్టింగ్‌ చేయాలి.. టాయ్‌లెట్లతోపాటు కిటికీలు, తలుపులు పెట్టించి లబ్ధిదారుడి చేతికి అప్పగించాలి. అప్పుడే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయాల్సి ఉంది. గత జులై మాసంలో ఒక ఇల్లు పూర్తయితే.. సెప్టెంబరు 22 నాటికి మరో ఇల్లు నిర్మించారు. ఆ తర్వాత 2024 మార్చి నాటికి 58 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఒక్కటీ నిర్మించలేదు. గుత్తేదారుల సంఖ్య 22కు పెరిగినా ఇళ్ల నిర్మాణం మూడడుగులు ముందుకు కదలలేదు. గుత్తేదారులకు ఇప్పటి వరకు రూ.98.31 కోట్లు సమర్పించారు. కేవలం 58 ఇళ్లు పూర్తి చేశారు. రూ.కోట్లు కరిగిపోయినా... లబ్ధిదారుల చేతికి ఇళ్లు అందని పరిస్థితి నెలకొంది.

నాణ్యతకు పగుళ్లు

  • మూడో ఆప్షన్‌ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. పునాదులు చెదురుతున్నాయి. గృహ నిర్మాణాలకు అనుమతి పొందిన సంస్థలు ఆదిలో హడావుడి చేసి తర్వాత చేతులెత్తేశాయి.. క్యూరింగ్‌ చేసేవారు లేరు.. నిర్దేశించిన నిష్పత్తిలో సిమెంటు కలిపారో లేదో తెలియడం లేదు.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులు పర్యవేక్షించలేదు. అడిగేవారు లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు.
  • ఆదోని పట్టణ శివారులో సుమారు 100 ఎకరాల్లో ప్లాట్లు వేసి 10 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మొదటి విడతగా 5,101 ఇళ్లు నిర్మిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయి. పనులు పూర్తికాక మునుపే గోడలు పగుళ్లిచ్చాయి.
  • ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్ననగర్‌ కాలనీలో 1,075 నిర్మాణాలు ప్రారంభించారు. ఒక్కో ఇంటికి 21 రోజులపాటు క్యూరింగ్‌ చేస్తేనే గోడలు బలంగా ఉంటాయి. కాలనీలో దానిమాటే మరిచిపోయారు. ఇళ్లు నెర్రెలిస్తుండటంతో అవి కనిపించకుండా మాయ చేశారు. ఇక్కడ 22 ఇళ్లకు పగుళ్లు రావడం గమనార్హం. ఇసుక, సిమెంటు సరిగా ఉపయోగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

18 సంస్థలు ఒక్కటీ నిర్మించలే

  • ఆప్షన్‌-3 కింద మొత్తం 22 సంస్థలకు ఇళ్ల నిర్మాణాల బాధ్యతలు అప్పగించారు. అందులో ఓబులపతి 9, వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్‌ సంస్థ 35, అన్నాజీ గిరీశ్వరరెడ్డి సంస్థ 1, శ్రీగాయత్రి కన్‌స్ట్రక్షన్‌ 13 కలిపి మొత్తం 58 ఇళ్లు పూర్తి చేశాయి. మిగిలిన 18 గుత్తేదారు సంస్థలకు ఏకంగా రూ.91.83 కోట్లను విడుదల చేసినా ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదు.
  • బోయెల్ల కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఆదోని అర్బన్, ఎమ్మిగనూరు గ్రామీణం, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణ ప్రాంతాల్లో 4,986 ఇళ్లు నిర్మించేందుకు ముందుకొచ్చింది. రెండేళ్లు గడిచినా ఒక్కటీ పూర్తి చేయలేదు. సదరు సంస్థకు ఇప్పటి వరకు నగదు రూపంలో రూ.36.32 కోట్లు చెల్లించగా.. సామగ్రి రూపేనా రూ.19.43 కోట్లు కలిపి మొత్తం రూ.55.76 కోట్ల చెల్లించారు. ఒక్క ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు.
  • వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కౌతాళం, కోసిగి, మంత్రాలయం, గోనెగండ్ల మండలాల్లో 860 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటి వరకు కేవలం 35 ఇళ్లు నిర్మించారు. సదరు సంస్థకు రూ.5.08 కోట్లు చెల్లించారు.  
  • శ్రీవరసిద్ధి వినాయక కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కౌతాళం, కోసిగి మండలాల్లో 455 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. పునాది దశలో 223, రూఫ్‌ లెవెల్‌లో 6 ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణ పనులు చేయలేక చేతులెత్తేంది.. ఆ సంస్థకు నగదు, సామగ్రి రూపంలో రూ.2.03 కోట్ల చెల్లించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని