logo

వైద్య ‘కల’శాల

గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది.

Updated : 04 Jul 2024 03:45 IST

నిధులు మళ్లించిన గత ప్రభుత్వం
పనులకన్నా ప్రచారానికే ప్రాధాన్యం
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

ఆదోనిలో నిర్మాణంలో వైద్య కళాశాల

గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది. నాబార్డు ఆర్థిక సాయంతో చేపట్టిన ఆదోని వైద్య కళాశాల నిధులు దారి మళ్లించింది. ఇక్కడ నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ కళాశాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. పనులకన్నా వైకాపా ప్రచారానికే ప్రాధాన్యమివ్వడం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

బకాయిలతో పురోగతి కరవు

నంద్యాల వైద్య కళాశాలలో గతేడాదే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ రూ.450 కోట్ల వ్యయంతో ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన 50 ఎకరాల భూమిలో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.80 కోట్ల పనులు జరిగాయి. తరగతి గదుల నిర్మాణాలు పూర్తయినా వసతిగృహాల నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 180 మంది విద్యార్థినులు, 120 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు చేపట్టిన ఈ వసతిగృహాల నిర్మాణం ఏడాదిగా కొనసాగుతోంది. ఇక్కడ రూ.80 కోట్ల పనులు జరిగినా గుత్తేదారుకు రూ.60 కోట్ల బిల్లులు మాత్రమే అందాయి. మరో రూ.20 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉంది. బకాయిలు పెద్ద మొత్తంలో ఉండటంతో పనుల్లో పురోగతి కరవైంది.

ఆసుపత్రి నిర్మాణం మాటేమిటి?

వైద్య విద్యలో భాగంగా తొలి రెండేళ్లు థియరీ మాత్రమే బోధిస్తారు. మూడో ఏడాది నుంచి ప్రాక్టికల్స్‌ అవసరం ఉంటుంది. ఇందుకు అనుబంధ ఆసుపత్రి నిర్మాణం జరగాల్సిందే. విద్యార్థులు మూడో ఏడాదిలోకి ప్రవేశించే లోగానే కళాశాలలో కచ్చితంగా అనుబంధ ఆసుపత్రి భవనం అందుబాటులో ఉండాలి. కానీ నంద్యాలలో ఇంత వరకు ఆసుపత్రి నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ఆరు బ్లాక్‌లతో కూడిన అనుబంధ ఆసుపత్రి నిర్మాణం జరగాలంటే కనీసం రెండేళ్ల సమయం పట్టే ఆస్కారముంది. ఇక్కడ మాత్రం వచ్చే ఏడాదికల్లా ఆసుపత్రి అందుబాటులో ఉండాలి. నిర్మాణ పనులకు మాత్రం ఇంతవరకు పునాదులు కూడా తీయలేదు. చేసిన పనులకే గుత్తేదారులకు బిల్లులు రాలేని పరిస్థితుల్లో ఈ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించి ఎన్నటికి పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆదోనిలో ప్రవేశాలపై ప్రభావం

ఆదోని శివార్లలో రూ.475 కోట్లతో గతేడాది వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించారు. 2024- 25 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని గతంలో ప్రజాప్రతినిధులు ప్రకటించారు. గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ కళాశాల కోసం నాబార్డు విడుదల చేసిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది. ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించింది. దీంతో ఇప్పటి వరకు గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం జరుగుతోంది. రూ.50 కోట్ల పనులు చేయగా.. రూ.30 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.20 కోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో నిర్మాణ సంస్థ పనులను నెమ్మదిగా చేస్తోంది. ఒప్పందం ప్రకారం డిసెంబరు 31 నాటికి కళాశాల భవనం పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్‌ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొదటి అంతస్తు పనులు కొన్ని రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నిర్మాణ పనులకు మరో రెండేళ్లు పట్టే అవకాశముంది. ఇటీవల ఆదోనికి వచ్చి తనిఖీ చేసిన ఎంసీఐ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. ఎంసీఐ బృందం ఇచ్చే నివేదికను బట్టి ఈ ఏడాది కళాశాల ప్రారంభమవుతుందా లేదా అన్నది తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని