logo

క్లస్టర్‌ విశ్వ‘వివాదాలయం’

నగరంలో క్లస్టర్‌ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Published : 04 Jul 2024 03:40 IST

యూజీసీ నిబంధనలు కాలరాశారు
భ్రష్టు పట్టించిన వైకాపా ప్రభుత్వం
వర్సిటీలో పాలన అస్తవ్యస్తం
కర్నూలు విద్య, న్యూస్‌టుడే

నగరంలో క్లస్టర్‌ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, సిల్వర్‌జూబ్లీ కళాశాలలను అనుసంధానంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత అధికార గద్దెనెక్కిన వైకాపా పట్టించుకోలేదు. కేవలం ఉప కులపతి పోస్టును మంజూరు చేశారు. పరిపాలనా సౌలభ్యం నిమిత్తం శ్రీ వేంకటేశ్వర వర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ డి.శ్రీనివాసులును వీసీగా నియమించారు.. ఆయన 2021-22 విద్యా సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో క్లస్టర్‌ వర్సిటీ వివాదాలమయంగా మారింది.

ప్రవేశాలపై ప్రభావం

క్లస్టర్‌ వర్సిటీ పరిధిలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడంతో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడింది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గింది. కేవీఆర్‌లో 1,100 సీట్లకు 553, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో 355 సీట్లకు 239, సిల్వర్‌జూబ్లీలో 280 సీట్లకు 255 మంది విద్యార్థులు చేరారు. ఈ ఏడాది ప్రవేశాలు జరగాల్సి ఉంది.

‘వసతి’ నిర్వహణ గాలికి

సిల్వర్‌జూబ్లీ కళాశాలలో ప్రవేశం తీసుకున్న విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటారు. ఇక్కడ బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలున్నాయి. 750 మంది వసతి పొందడానికి వీలుంది. వసతిగృహం నిర్వహణ (సిబ్బంది వేతనాలు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యుత్తు బిల్లు) నిమిత్తం ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ సొమ్ము కళాశాలకు చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. 2021-22 నుంచి క్లస్టర్‌ వర్సిటీకి చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. వసతి గృహాల్లో సమస్య పరిష్కారానికి అయ్యే ఖర్చును క్లస్టర్‌ వర్సిటీ వీసీని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిధులివ్వడానికి వారు పేచీ పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వసూలు చేస్తున్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

విద్యుత్తు వినియోగంలో పక్కదారి

క్లస్టర్‌ వర్సిటీ పరిపాలన భవనానికి విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో సిల్వర్‌జూబ్లీ కళాశాలకు చెందిన బాలికల వసతిగృహం నుంచి అక్రమంగా కనెక్షన్‌ తీసుకున్నట్లు సమాచారం. విద్యుత్తు శాఖ అనుమతి లేకుండానే కనెక్షన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.2021 వరకు వసతిగృహానికి ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.13 వేల మధ్యలో విద్యుత్తు బిల్లు వచ్చేది. ప్రస్తుతం రూ.24 వేల నుంచి రూ.44 వేలకు పెరిగింది. జనవరిలో రూ.20,826, ఫిబ్రవరి 39,969, మార్చి రూ.46,123, ఏప్రిల్‌లో రూ.44.243 చెల్లించారు. వసతిగృహ నిర్వహణ నిమిత్తం వసూలు చేసిన సొమ్మును ఇందుకు వినియోగిస్తున్నారు.

విద్యార్థుల సొమ్ము ప్రైవేటు బ్యాంకులో జమ

విద్యార్థి ఏ కళాశాలలో చేరితే అక్కడే రుసుములు చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని పక్కన పెట్టారు..2023-23 విద్యా సంవత్సరంలో కేవీఆర్, సిల్వర్‌జూబ్లీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థుల నుంచి క్లస్టర్‌ వర్సిటీ అధికారులు వసూలు చేస్తున్నారు. ప్రథమ ఏడాదిలో చేరిన ఒక్కో విద్యార్థి నుంచి వసతి గృహం రుసుమురూ.4 వేలు, ప్రవేశ రుసుము రూ.9,500 వసూలు చేశారు. ఇలా వసూలైన సొమ్ము సుమారు రూ.కోటి వరకు కర్నూలు మద్దూర్‌ నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సమాచారం.

సీఐడీ లేఖ బుట్టదాఖలు

క్లస్టర్‌ వర్సిటీ పరిధిలో మూడు కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుము ప్రైవేటు బ్యాంకులో జమ చేయడం వివాదాలకు దారి తీసింది. ఈ విషయమై ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ కారణంగానే వారిద్దరిని బదిలీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. క్లస్టర్‌ వర్సిటీలో ఫీజుల అక్రమాలపై కొందరు వ్యక్తులు 2023 అక్టోబరులో సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని సీఐడీ కార్యాలయం నుంచి గతేడాది డిసెంబరులో అప్పటి కలెక్టర్‌కు లేఖ వచ్చింది. ఇప్పటివరకు విచారణ చేయకపోవం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని