logo

వినూత్న ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ

బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Updated : 04 Jul 2024 05:10 IST

‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ నామినేషన్ల నమోదుకు శ్రీకారం
2024-25 ఏడాదికి ప్రతిపాదనలకు ఆహ్వానం
సెప్టెంబరు 15 వరకు గడువు
న్యూస్‌టుడే, డోన్‌పట్టణం

బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ పేరిట ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబరు 15 వరకు గడువును ఇచ్చింది.

ఆన్‌లైన్‌ ద్వారా.. సేకరణ

2024-25 ఏడాదికి గానూ ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల ఒకటి నుంచి మొదలైంది. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు అభ్యసించే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఉన్నత పాఠశాలల నుంచి ఐదు చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మూడు చొప్పున నామినేషన్లను స్వీకరిస్తున్నారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఇన్‌స్పైర్‌అవార్డ్స్‌-డిఎస్‌టి.జీవోవి.ఇన్‌లో వివరాలను నమోదు చేయాలి. పాఠశాల అథారిటీ ఐచ్ఛికాన్ని క్లిక్‌చేసి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసి, పాఠశాల వివరాలను పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈ- మెయిల్, యూజర్‌ ఐడీతో లింక్‌ రాగానే పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. దీని తర్వాత ప్రాజెక్టు నమూనాకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చాలి.

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న కర్నూలు జిల్లా విద్యార్థులు

ఉమ్మడి జిల్లాలో ఎంపికలు..

  • ఉమ్మడి జిల్లాలో ప్రతి పాఠశాల నుంచి గైడ్‌ ఉపాధ్యాయుడితో కలిసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నమూనాతో పాల్గొంటారు. 2021-22 ఏడాదికి గానూ 1,950 నామినేషన్లకు గాను 253 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో 24 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, వాటిలో ఒక నమూనా మాత్రమే జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలకు ఎంపికైంది. 2022-23లో 3,181 నమోదు కాగా 352 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికైన ప్రాజెక్టుకు సంబంధించి నమూనాను రూపొందించేందుకు బ్యాంకు ఖాతాలో రూ. 10వేలు జమ చేశారు. 2024 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో కర్నూలులోని శ్రీ చైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో, నంద్యాలలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో సైన్స్‌ జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. కర్నూలు జిల్లా నుంచి 14, నంద్యాల జిల్లా నుంచి 15 మొత్తం 29 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు దగ్గర మదర్‌థెరెసా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టారు. జాతీయస్థాయికి ఒక ప్రాజెక్టు ఎంపిక కాకపోవడం గమనార్హం.
  • 2023-24 ఏడాదిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3,610 ప్రాజెక్టులు నమోదు కాగా, 361 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి

పోటీలు..ప్రోత్సాహకాలు

  • జిల్లాస్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తే..అక్కడ ఉత్తమంగా ఉన్న వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చాటితే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ స్థాయి ప్రాజెక్టులకు ప్రభుత్వం పేటెంట్‌ హక్కులను ఇస్తుంది. జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవొచ్చు.
  • రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రాజెక్టులకు సంబంధించి విద్యార్థులు పాల్గొని అక్కడ వారి ప్రతిభను, సామర్థ్యాన్ని చూపి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన ప్రాజెక్టులకు గానూ బాల మేధావులకు రూ.25వేల వరకు శాస్త్ర, సాంకేతిక మండలి శాఖ అదనపు నిధులను కేటాయిస్తోంది. 

ఏయే అంశాల్లో చేయాలంటే

శాస్త్రీయంగా సమాజానికి ఉపయోగ పడేలా చేసిన ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్వచ్ఛభారత్, మేక్‌ ఇన్‌ ఇండియా, సమాజాభివృద్ధి, క్లీన్‌ ఇండియా, అంశాల ఆధారంగా ప్రాజెక్టులను రూపొందించాలి.


ఎక్కువ నామినేషన్లు ఉండేలా చూడాలి

-ఎస్‌.రంగమ్మ, జిల్లా సైన్స్‌ అధికారిణి, కర్నూలు

2024-25 ఏడాదికి గానూ ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ సారి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి నామినేషన్లను ఎక్కువ చేయించాలి. రాష్ట్రంలో జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాపాధ్యాయులు కృషి చేయాలి. పాఠశాలలో గైడ్‌ ఉపాధ్యాయులు సృజనాత్మకంగా కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు ఉండేలా విద్యార్థులతో ప్రాజెక్టులను తయారు చేయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని