logo

గూల్యం బ్యాడిగ విత్తనం అమూల్యం

రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు.

Updated : 04 Jul 2024 03:32 IST

మిరప సాగుపై ఆసక్తి
నేరుగా అన్నదాతల చెంతనే కొనుగోలు
న్యూస్‌టుడే, హాలహర్వి

రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు. హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో దొరికే బ్యాడిగ మిరప విత్తనాలకు భలే గిరాకీ ఉంటుంది. ఆదోని డివిజన్‌లో చాలా గ్రామాల రైతులు గూళ్యం గ్రామానికి వెళ్లి కొనుగోలు చేస్తారు.

పశ్చిమాన సాగు అధికం

కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాల్వ, బోరుబావులు, ఎత్తిపొతుల పథకం, వంకలు, వాగులు, నీటి కుంటల కింద మిరప పంటను అధికంగా సాగు చేస్తారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైన ఆదోని, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు, ఆలూరు, హాలహర్వి, హొళగుంద మండలాల్లో బ్యాడిగి రకం మిరపపై రైతులు ఆసక్తి చూపుతుంటారు. ఆస్పరి, దేవనకొండ మండలాల్లో గుంటూరు, బ్యాడిగి రకాలు సాగు చేస్తారు. అందులో 70శాతం బ్యాడిగ రకానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకుండా ఒకే చోట నాణ్యమైనా విత్తనాలు దొరికే చోటుకు వెళ్లి రైతులు తెచ్చుకుంటారు.

మిరప నుంచి విత్తనాలు వేరు చేస్తున్న యంత్రం

ఇలా చేస్తారు..

విత్తనాలు కోసం ఎండు మిరపను కిలో రూ.1200 నుంచి రూ.1400 వరకు విక్రయిస్తారు. సాగు చేయాలంటే ఒక ఎకరానికి 5 కిలోల ఎండు మిరపను తీసుకోవాలి. దీన్ని యంత్రంలో విత్తనాలు వేరు చేసేందుకు కిలోకు రూ.15 నుంచి రూ.25 వరకు తీసుకుంటారు. ఒక కిలో ఎండు మిరపకు 600గ్రాముల నుంచి 800గ్రాముల వరకు విత్తనాలు వస్తాయి. ఎండు మిరపపై పొట్టు వంటల్లో వినియోగించుకోవచ్చు.. ఆదోని డివిజన్‌లో ఆదోని, పెద్దకడబూరు, కౌతళం, మంత్రాలయం, కోసిగి, ఆలూరు, హొళగుంద మండలాలు నుంచి వేలాధి మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తారని గూళ్యం గ్రామస్థులు చెబుతున్నారు.

గంపలోకి పడుతున్న విత్తనాలు

కర్ణాటక విత్తనమే ఎందుకు..?

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో కొందరు రైతులు, వ్యాపారులు కర్ణాటక ప్రాంతంలో వర్షధారం కింద సాగు చేసిన బ్యాడిగ రకం ఎండు మిరప కాయాలను కొనుగోలు చేసి విత్తనాల కోసం అన్నదాతలకు విక్రయిస్తారు. స్థానికంగా సాగు చేసిన పంటకు అధికంగా క్రిమి సంహారక మందులు, ఎరువులు అధికంగా వినియోగించడంతో ఆ పంట నుంచి వచ్చిన విత్తనానికి సరైన నాణ్యత ఉండదనేది రైతుల అభిప్రాయం. దీంతో కర్ణాటక వాతావరణంలో సాగైన మిరపను ఇక్కడ విక్రయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని