logo

కూటమిలో కలిసేందుకు కసరత్తు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు.

Published : 04 Jul 2024 03:26 IST

ముమ్మర ప్రయత్నాల్లో వైకాపా నాయకులు
అక్రమార్కులను చేర్చుకోవద్దంటున్న కూటమి నేతలు

ఈనాడు, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలకు పాల్పడి పీకల్లోతు ఇబ్బందుల్లో పడ్డారు. అవన్నీ రుజువైతే పోలీసు కేసులు తప్పవని భయపడి కండువా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ చేర్చుకోవద్దని స్థానిక నాయకులు తెగేసిచెబుతున్నారు. అలాంటి వారిని చేర్చుకోవద్దని ప్రజలూ విన్నవిస్తున్నారు. ఆదోని పట్టణంలో ఓ కౌన్సిలర్‌ ఎమ్మెల్యే సమక్షంలో చేరడానికి వస్తే ప్రజలు అడ్డుకోవడం గమనార్హం.

ఎక్కడ ఎవరు చేరారంటే

  • కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని మూడో వార్డు కార్పొరేటర్‌ షేక్‌ షాజహాన్‌ పర్వీన్, ఆరో వార్డు కార్పొరేటర్‌ షేక్‌ నీలోఫర్, 13వ వార్డు కార్పొరేటర్‌ విజయలక్ష్మి వైకాపా నుంచి కొన్ని రోజుల కిందటే తెదేపాలోకి వచ్చారు. ఎన్నికలకు ముందు నలుగురు చేరారు. 52 వార్డులున్న కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో ఎనిమిది మంది తెదేపా తరఫున విజయం సాధించగా... తాజా చేరికలతో వారి సంఖ్య 15కు పెరిగినట్లైంది. మరో ఐదుగురు తెదేపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
  • ఆదోనిలో కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి బుధవారం భాజపాలో చేరారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మ, పలువురు సర్పంచులు చేరారు. ఆదోని పురపాలక సంస్థ పరిధిలో 42 మంది కౌన్సిలర్లలో 41 మంది వైకాపాకు చెందిన వారుండగా, ఒక్కరే తెదేపాకు చెందినవారు కావడం గమనార్హం. ఎమ్మెల్యే పార్థసారధి భాజపాకు చెందినవారు కావడంతో పలువురు ఆపార్టీలోనూ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
  • ఎమ్మిగనూరు పురపాలిక పరిధిలో 34 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 31 మంది వైకాపాకు చెందినవారే. మిగిలిన ముగ్గురు తెదేపా కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందారు. పురపాలికలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కౌన్సిలర్‌ తెదేపా జిల్లా అధ్యక్షుడిని బుధవారం కలవడం చర్చనీయాంశమవుతోంది.
  • ఆళ్లగడ్డ పురపాలికలో 27 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో ముగ్గురు తెదేపాకు చెందినవారున్నారు. ఎన్నికలకు ముందే కౌన్సిలర్‌ సుధామణి తెదేపాలో చేరగా, తాజాగా వైకాపాకు చెందిన లక్ష్మీ నరసింహులు, వెంకటసుబ్బయ్య, బాలబ్బి, మహబూబ్‌బాషా, మల్లేశ్వరి, వైస్‌ ఛైర్మన్‌ నాయబ్‌రసూల్‌ తెదేపాలోకి వచ్చారు. కౌన్సిలర్‌ గురుమూర్తి జనసేనలోకి వచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని