logo

కలెక్టర్‌గా రాజకుమారి

జిల్లా కలెక్టర్‌గా జి.రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 03 Jul 2024 04:06 IST

గణియా రాజకుమారి 

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లా కలెక్టర్‌గా జి.రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డా.కె.శ్రీనివాసులును బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. గ్రూప్‌-1 అధికారైన బి.రాజకుమారి 2016లో ఐఏఎస్‌ హోదా పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన శ్రీనివాసులు ఎన్నికల విధుల్లో నెమ్మదిగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌పీ, వీఎస్‌పీ టీం, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాల్లో మండల స్థాయి అధికారులను కాకుండా జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్లతో పాటు వెలుగు ఏపీఎం, ఏపీవో తదితర ఒప్పంద ఉద్యోగులను నియమించడం వివాదానికి కారణమైంది. ఈసీ ఈ విషయాన్ని తప్పుపట్టడంతో తిరిగి గెజిటెట్‌ అధికారులను నియమించారు.

గ్రూప్‌-1 స్థాయి నుంచి...  

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొల్లివలస గ్రామానికి చెందిన జి.రాజకుమారి 2007లో గ్రూప్‌-1కు ఎంపికయ్యారు. మొదట విజయనగరం సహకార రిజిస్ట్రార్‌గా నియమించారు. మరోసారి గ్రూప్‌-1కు ప్రయత్నించి విజయనగరం ఆర్డీవోగా నియమితులయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2014లో విజయనగరం జడ్పీ సీఈవోగా పనిచేశారు. 2017లో తూర్పుగోదావరి జిల్లా డ్వామా పీడీగా, 2019లో కాకినాడ ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం)గా పనిచేశారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ అయిన ఆమె ఇప్పటి వరకు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆమె గుంటూరు జిల్లాలో పని చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని