logo

సాగు యంత్రం..వైకాపా కుతంత్రం

వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్‌సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది

Published : 03 Jul 2024 03:44 IST

కార్యకర్తల ఇళ్ల వద్దే ట్రాక్టర్లు
రైతులకు దక్కని సేవలు

మద్దికెర మండలంలో వైకాపా కార్యకర్త ఇంటి ఎదుట ఉన్న ట్రాక్టర్‌ 

వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్‌సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది. అప్పటి వైకాపా ప్రజాప్రతినిధులు సిఫారసులు ఉన్నవారికే సాగు యంత్రాలు కట్టబెట్టారు. వారికి సహకార బ్యాంకులో రుణాలు ఇప్పించి ఆ బ్యాంకును నిండా ముంచారు. వైకాపా హయాంలో పంపిణీ చేసిన సాగు యంత్రాలపై విచారణ చేయనున్నట్లు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ యంత్రసేవ పథకం తీరుపై ‘న్యూస్‌టుడే’ ఆరా తీయగా.. పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. తెదేపా హయాంలో ‘రైతు రథం’ పేరిట ఒక్కో రైతుకు రూ.2.50 లక్షల రాయితీపై 650 మందికిపైగా రైతులకు ట్రాక్టర్లు  అందజేసేవారు. టార్పాలిన్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, రోటావేటర్లు, పవర్‌ టిల్లర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేసేవారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా రూ.30-50 కోట్లు ఖర్చు చేసేవారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు విన్నవిస్తున్నారు.

కర్నూలు వ్యవసాయం, మద్దికెర, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం పరిధిలో వినియోగదారుల అద్దె కేంద్రాన్ని (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌-సీహెచ్‌సీ) నెలకొల్పారు. ఐదారుగురు రైతులను కలిపి ఓ బృందంగా ఏర్పాటు చేశారు. ఒక యూనిట్‌ విలువ రూ.15 లక్షలు.. అందులో 10 శాతం రైతులు, 50 శాతం బ్యాంకు రుణం, మిగిలిన 40 శాతం రాయితీ (రూ.6 లక్షలు)గా ఉంటుంది. 2021 నుంచి 2023 వరకు కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 వైఎస్సార్‌ యంత్ర సేవా యూనిట్లు మంజూరు చేశారు. ఇవన్నీ వైకాపా కార్యకర్తలకే కట్టబెట్టారు. రాయితీ రూపంలో ఆ పార్టీ కార్యకర్తలకు రూ.62.70 కోట్ల అందజేయడం గమనార్హం. 

రైతుల విన్నపాలు బుట్టదాఖలు

చిన్న ట్రాక్టర్లు, వాటికి అనుబంధ పరికరాలు, తోలు దుక్కుల మడలు, విత్తన గొర్రులు, రోటావేటర్లు, పవర్‌ టిల్లర్లు, కలుపు తీసే పవర్‌ వీడర్లు, బహుళ పంటల మార్పిడి యంత్రాలు, టార్పాలిన్లు, అధునాతన తైవాన్‌ స్ప్రేయర్లు కావాలని అడుగుతున్నా వైకాపా ప్రభుత్వం స్పందించలేదు. 2022 ఆగస్టులో రాయితీపై కర్నూలు జిల్లాలో 25 మండలాలకు 75, నంద్యాల జిల్లాలో 28 మండలాలకు 84 కలిపి 159 డ్రోన్లు రాయితీపై పంపిణీ చేస్తామన్నారు. 20 నెలలు దాటినా రాయితీపై ఒక్కటీ ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు 37 మంది పైలట్‌ శిక్షణ పూర్తి చేసుకోగా, నంద్యాల జిల్లాలో మరో 40 మంది సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయినా ఇప్పటి వరకు డ్రోన్లు సరఫరా చేయలేదు. 

సహకార బ్యాంకును ముంచారు

అప్పటి వైకాపా ఎమ్మెల్యేల సిఫారసు మేరకు బృందంగా ఏర్పడిన ఆ పార్టీ కార్యకర్తలు సహకార బ్యాంకులో ఖాతాలు తెరిచారు. 10 శాతం వాటా చెల్లించి రూ.7.50 లక్షలు రుణం తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 350-400 వరకు రైతు బృందాలకు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని మంజూరు చేశారు. ఇందుకు రూ.30 కోట్లకుపైగా సహకార బ్యాంకులో రుణాలు పొందారు. వాటిని అద్దెలకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో రుణ వాయిదాలు చెల్లించాలి. సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చెల్లించాలని సహకార బ్యాంకు శాఖ అధికారులు నేతల చుట్టూ తిరుగుతున్నా స్పందనలేదు.

అద్దె సొమ్ము ఆరగించారు

 రాయితీ యంత్రాలను ఆర్బీకేల ఎదుట ఉంచి అవసరమైన వారికి అద్దెకు ఇవ్వాలి. క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైకాపా నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి 2,717 మంది రైతులు అద్దె ప్రాతిపదికన యంత్రాలు తీసుకున్నారు. తీసుకున్నవారి వివరాలు యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా... అలా జరగలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 877 యూనిట్లు మంజూరు చేయగా కర్నూలు జిల్లాలో 84 సీహెచ్‌సీలు, నంద్యాల జిల్లాలో 32 మాత్రమే వినియోగంలో ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయి. కొన్ని సీహెచ్‌సీ యూనిట్లను వైకాపా నాయకులు ఇతరులకు విక్రయించారు. ఆర్బీకేల దగ్గర ఉండాల్సిన యంత్ర సేవా యూనిట్లు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉండటం గమనార్హం.

రూ.180 కోట్ల దారి మళ్లింపు 

సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) కింద ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి సుమారు రూ.50 కోట్లతో సాగుకు అవసరమయ్యే పరికరాలు రాయితీపై ఇవ్వాలి. 2021 నుంచి 2023-24 వరకు రూ.150 కోట్ల విలువ చేసేవి పంపిణీ చేయాల్సి ఉండగా, మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం కనీసం రూ.30 కోట్ల విలువైనవి ఇవ్వలేకపోయింది. మూడేళ్లల్లో రూ.180 కోట్లను అప్పటి ప్రభుత్వం దారి మళ్లించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని