logo

154 ఏళ్ల తర్వాత.. నల్లమలలో అడవి దున్న అడుగులు

జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి

Updated : 03 Jul 2024 06:04 IST

బైర్లూటి రేంజిలో సంచారం

నల్లమలలో వెలుగోడు రేంజ్‌లో తిరుగాడుతున్న అడవి దున్న 

ఆత్మకూరు, న్యూస్‌టుడే : జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. కొంత కాలం నుంచి చిరుతల సంతతి భారీగా పెరిగింది. అడవి దున్నల జాడ కనిపించకుండాపోయింది. భారీ శరీరంతో మందలుగా సంచరించే అడవి దున్నలు సింహాలనూ తరిమికొట్టగలవు. 1870 తర్వాత నల్లమలలో వాటి ఆచూకీ లభించలేదు. మళ్లీ ఇప్పుడు ఒకటి ప్రత్యక్షం కావడంతో అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనవరిలోనే గుర్తింపు

నల్లమల అడవిలోని వెలుగోడు రేంజ్‌లో అడవి దున్న సంచరిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే గుర్తించారు. అప్పట్లో వాట్సప్‌ గ్రూపుల్లో వైరలైంది. ఇది తప్పుడు సమాచారం అని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి అది అడవిలో తిరుగుతూ ప్రస్తుతం బైర్లూటి రేంజ్‌లోకి రావడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది బైర్లూటి ఎకో టూరిజం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. జంగిల్‌ సఫారీ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇది కనువిందు చేసే అవకాశం ఉంది.

అప్పట్లో వేల సంఖ్యలో..

నల్లమల అడవిలో 1870కి ముందు అడవిదున్నలు వేల సంఖ్యలో ఉండేవని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎఫ్‌వో కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న ఆనాటి బ్రిటిష్‌ గెజిట్‌ను ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. ఇండియన్‌ బైసన్‌గా గుర్తింపు పొందిన ఇవి ఏడడుగుల ఎత్తు.. పదడుగుల పొడువైన భారీ శరీరంతో ఒక్కోటి 800 నుంచి వెయ్యి కిలోల వరకు బరువు ఉంటాయి. ఐదు నుంచి 20 వరకు మందలుగా ఏర్పడి సంచరిస్తుంటాయి. నల్లమలలో విస్తారమైన గడ్డి మైదానాలు, వెదురు సంపద ఉన్నా హఠాత్తుగా ఇవి అంతరించిపోవడానికి కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు. 19వ శతాబ్దం వరకు నల్లమలలో సందడి చేసిన దున్నలు 20వ శతాబ్దంలో ఎలా కనుమరుగయ్యాయో ఇప్పటికీ అధికారులు తేల్చలేకపోయారు. గాలికుంటు వంటి ప్రాణాంతక వ్యాధుల వల్ల ఇవి అంతరించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.


కొద్ది నెలలుగా కనిపిస్తోంది: సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు అటవీ డివిజన్‌

అడవి దున్నను ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్‌లో మొదటిసారి గుర్తించాం. అడివిలో గస్తీ తిరిగే సిబ్బందికి అప్పుడప్పుడు కనిపిస్తోంది. గత నెలలో బైర్లూటి రేంజ్‌లో గుర్తించారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే తిరిగాడుతోంది. కర్ణాటక వైపు నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. కృష్ణానదిని దాటుకుని నల్లమలలోకి ప్రవేశించి ఉండవచ్చు. ఒక్కటే ఉందా మరికొన్ని ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు పరిశీలన చేస్తున్నాం.


కర్ణాటక నుంచి వచ్చి ఉండవచ్చు

ప్రస్తుతం నల్లమలలో కనిపించిన అడవి దున్న ఇక్కడికి ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జనవరిలో నాగార్జునసాగర్‌- శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్‌ వెలుగోడు రేంజ్‌లో దర్శనమిచ్చింది. మళ్లీ ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో అటవీ సిబ్బందికి కనిపించింది. ఈనెల 23వ తేదీ నుంచి బైర్లూటి రేంజ్‌లో సంచరిస్తోంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో తిరుగాడే అడవి దున్నలు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని