logo

డీఎస్సీ కప్పు కొట్టాలి కోహ్లిలా!

మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు..

Updated : 03 Jul 2024 03:33 IST

విడుదలైన టెట్‌ ప్రకటన
త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 
ఉమ్మడి జిల్లాలో 2,551 ఖాళీల గుర్తింపు
భారత క్రికెట్‌ జట్టు గెలుపే స్ఫూర్తి పాఠం

కర్నూలు, నంద్యాల విద్య, న్యూస్‌టుడే : మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. మరో వారంలో డీఎస్సీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది..  ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,551 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలింది. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరి  గెలుపు ‘క్యాచ్‌’ అందాలంటే ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి. ఒత్తిడిని అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. ఇలాంటి గెలుపు సూత్రాలతోనే భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ విజేతగా నిలిచి టీ20 ప్రపంచ కప్‌ను చేజిక్కించుకుంది. ఆ సమష్టి కృషి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతిఒక్కరికి స్ఫూర్తినిస్తుంది.  

రెండు నెలల గెలుపు పోరు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెట్‌కు డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికిపైగా బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. ఒత్తిడిని అధిగమించి విజయతీరాలకు చేరాలంటే.. భారత జట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ ఆటకు మలుపు. బంతి బౌండరీ దాటేలోపే సమయస్ఫూర్తితో ఒడిసిపట్టిన తీరు విజయానికి కీలకమైంది. పట్టుదల, ఏకాగ్రతతో పాటు చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే.. కొలువు మీ సొంతమవుతుంది.

గత ఓటములే గుణపాఠాలు

2023 నవంబరులో జరిగిన వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చెందింది. ఆ సమయంలో ఎన్నో అవమానాలు, ఒత్తిళ్లు ఎదుర్కొంది. అయినాసరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంది. లోపాలను సరిదిద్దుకుని పట్టుదలతో టీ20 ప్రపంచ కప్‌లో అడుగుపెట్టింది. పొరపాట్లకు తావివ్వకుండా గ్రూప్‌ దశ నుంచి రాణించి జగజ్జేతగా నిలిచింది. గ్రూప్‌ దశలో 3 మ్యాచ్‌లాడి కోహ్లి చేసింది 5 పరుగులే. సూపర్‌-8లోనూ ప్రదర్శన అంతంతమాత్రం. సెమీఫైనల్లో అయినా ఆడతాడనుకుంటే.. అక్కడా నిరాశే. ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడి.. ఆపై చివర్లో చెలరేగి ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చాడు విరాట్‌. గతంలో విఫలమయ్యామని, ఫలానా సబ్జెక్టు కఠినంగా ఉందని నిరుద్యోగ అభ్యర్థులు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధమవ్వాలి.

ప్రణాళికే కీలకం

దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్‌ స్పిన్నర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ భారీ స్కోర్లు చేస్తుండటంతో టీం ఇండియా వ్యూహాన్ని మార్చింది. పేసర్లను రంగంలోకి దించి వికెట్‌ రాబట్టింది. చివరి ఐదు ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసిందంటే ప్రణాళిక ప్రకారం వ్యూహాలు అమలు చేశారు. పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు కూడా కఠిన దశను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఏం చదవాలోనన్న గందరగోళానికి గురవకుండా ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవ్వాలి.

సమష్టి అధ్యయనం కీలకం

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ కోహ్లి, అక్షర్‌ బ్యాటింగ్‌లో రాణించడంతో మంచి స్కోర్‌ సాధ్యమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడంలో బౌలరు,్ల ఫీల్డర్లు చురుగ్గా వ్యవహరించారు. సమష్టి కృషితో విజయం సొంతమైంది. పోటీ పరీక్షల వేళ నలుగురు, ఐదుగురు మిత్రులు బృందంగా ఏర్పడి చదువుకుంటే సందేహాలను నివృత్తి చేసుకుంటూ.. లోపాలను సవరించుకుంటూ విజయ తీరాలకు చేరవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని