logo

బడి బువ్వ బాలేదు

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

Updated : 03 Jul 2024 03:28 IST

తినేందుకు విద్యార్థుల అనాసక్తి
నాణ్యతాలేమిపై తాఖీదులు

ఎమ్మిగనూరు: పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలో ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్న విద్యార్థినులు  

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. హాజరైన వారందరికీ భోజనం వండుతున్నా చాలామంది తినడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. గొప్ప మెనూ అమలు చేస్తున్నాం.. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామంటూ.. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం గొప్పలు పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. చాలామంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేందుకు ఇష్టపడడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై నిఘా పెట్టింది. ఇప్పటికే నాణ్యత సరిగ్గా ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చిన పాఠశాలలకు తాఖీదులు జారీ అయ్యాయి.

నాణ్యతపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మధ్యాహ్నం భోజనం నాణ్యతపై అధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అన్నం మెత్తగా ఉంటోందని, మెతుకులు లావుగా ఉన్నాయని, పప్పు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. 90 శాతం విద్యార్థులు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలాచోట్ల 80 శాతం మందే తింటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విద్యార్థులు హాజరుతో పాటు భోజనం తినేవారి సంఖ్యను ఆన్‌లైన్‌లో అధికారులు గమనించారు. వ్యత్యాసం అధికంగా ఉండటంతో క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలల్లో భోజనం తినే విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు సరిగ్గా ఇవ్వడం లేదు. కచ్చితమైన వివరాలు నమోదు చేయడం లేదు. విద్యార్థుల సంఖ్య కచ్చితంగా నమోదు చేస్తే తమకు ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న ఉపాధ్యాయులు కొన్నిచోట్ల తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నట్లు సమాచారం.

90 శాతం కన్నా తక్కువైతే తాఖీదులు

ఉమ్మడి జిల్లాలో 2,804 పాఠశాలలు ఉండగా.. విద్యార్థులు సంఖ్య 2,54,093. జూన్‌ నెల చివరి ఆరు రోజుల (జూన్‌ 24 నుంచి 29వ తేదీ వరకు) హాజరును పరిశీలిస్తే చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి పెద్దఎత్తున విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఒకవైపు విద్యాశాఖాధికారులు 90 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90 శాతం కంటే తక్కువ మంది భోజనం చేసిన పాఠశాలలను అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలని ఆయా పాఠశాలలకు తాఖీదులు ఇచ్చారు. ఆహారంలో నాణ్యత లేకపోవడం, తిన్న తర్వాత విద్యార్థులు ఇబ్బందిగా ఉందని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఇళ్లకు రావాలని పిల్లలకు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల్లో కొందరు ఇళ్ల నుంచే భోజనం తెచ్చుకుని పాఠశాలలో తింటున్నారు.

వైకాపా వారికే ఏజెన్సీల బాధ్యతలు

2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీలను మార్చి తమ వర్గీయులకు బాధ్యతలు అప్పగించింది. ఈ ఏజెన్సీల నిర్వహణ సరిగ్గా లేకపోయినా ఐదేళ్ల పాటు వారినే కొనసాగించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్నిచోట్ల ఏజెన్సీల నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకొంటున్నారు. నంద్యాల జిల్లాలోని అవుకు మండలంలోని 80 శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీల వారు స్వచ్ఛందంగా చాలించుకున్నారు. దీంతో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని