logo

తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’

అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా...   ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్‌ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్‌ సొమ్మును జేబులో పెట్టారు.

Updated : 02 Jul 2024 05:57 IST

ఊరూరా పింఛన్‌ పండగ
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

కర్నూలు : పింఛను సొమ్ము లెక్కిస్తున్న బోయ కృష్ణ.. ఆసక్తిగా చూస్తున్న మనవరాళ్లు

అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా...   ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్‌ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్‌ సొమ్మును జేబులో పెట్టారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన భరోసా లేఖను చేతికిచ్చారు. డబ్బులు అందుకోగానే వారి మోమున ఆనందం నిండిపోయింది.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేలు పెంచడమేకాక బకాయిలు ఇవ్వడం సంతోషకరమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

4.35 లక్షల మంది.. రూ.296.64 కోట్ల పంపిణీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,188 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి 50 ఇళ్లను ఓ క్లస్టరుగా మ్యాపింగ్‌ చేసి మండల, గ్రామ, వార్డుస్థాయి అధికారులను నియమించి పింఛన్లు పంపిణీ చేశారు.  కర్నూలులో 92 శాతం, నంద్యాలలో 94.98 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  ప్రతి సచివాలయం నుంచి ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు వంద శాతం పింఛన్లు పంపిణీ చేయడం విశేషం.

ఉమ్మడి జిల్లాలో  వృద్ధాప్య పింఛనుదారులే 2.41 లక్షల మంది ఉన్నారు. వీరికి జులైలో రూ.7 వేల చొప్పున రూ.169.37 కోట్లు కేటాయించారు.

మాట నెలబెట్టుకొన్న చంద్రన్న

వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హిజ్రాలు, డప్పు, రంగస్థల కళాకారుల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులు, బహుళ వైకల్యం ఉన్న వారి పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తిస్థాయి దివ్యాంగులకు ఇస్తున్నవి రూ.5 వేలను రూ.15 వేలకు పెంచారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పింఛను మొత్తాన్ని  రూ.10 వేలకు పెంచి అందజేశారు.

వాలంటీర్ల కంటే వేగంగా

తమ పాలనలో వాలంటీర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారంటూ వైకాపా ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది. వాలంటీర్లు లేకుంటే పింఛన్లు ఇవ్వడం కష్టమని వైకాపా పాలకులు చెబుతూ వచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం సోమవారం సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టి వాలంటీర్ల కంటే మెరుగ్గా పూర్తి చేశారు.

కాసేపు సతాయించిన సర్వర్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 7.30 నుంచి ఉదయం 10.30 గంటల వరకు సర్వర్‌ మొరాయించింది. సర్వర్‌ సాంకేతిక సమస్యల కారణంగా పింఛన్ల పంపిణీలో కొంత జాప్యం ఏర్పడింది.

ఆ ఇంట పింఛను పండగ

ఆస్పరి పట్టణానికి చెందిన రామన్న ఇంట్లో కుమారుడు గోవర్దన్, కోడలు లక్ష్మి, మనవడు అకీరానందన్, కుమార్తె మల్లేశ్వరి ఉంటున్నారు. నలుగురు దివ్యాంగులే. వీరిలో ముగ్గురికి పింఛను అందుతోంది. అకీరానందన్‌ ప్రస్తుతం ఏడాదిన్నర వయసు ఉండటంతో ఇంకా పింఛను అందడం లేదు. గతంలో ముగ్గురికి రూ.9 వేల పింఛను వచ్చేది. ప్రస్తుతం రూ.18 వేలు వస్తుండటంతో మా సమస్యలు సగం తొలగిపోతాయని ఇంటిల్లిపాది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పరి, న్యూస్‌టుడే

జీవితానికి అండ

దస్తగిరమ్మ, వృద్ధురాలు, గూడూరు

గూడూరు న్యూస్‌టుడే :  ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.7 వేలు పింఛను మొత్తం అందించడం మా జీవనానికి అండగా నిలిచింది. నాకు చంద్రబాబే పెద్ద కొడుకులా పింఛను అందిస్తూ పోషిస్తున్నారు. వృద్ధ్యాప్యం.. అనారోగ్యం నేపథ్యంలో ప్రతి రోజూ మాత్రలు వేసుకోవాలి. మందుల కోసం ఇకపై ఎవరిమీద ఆధారపడకుండా పెరిగిన పింఛను డబ్బు సరిపోతుంది. ఇప్పుడు కర్నూలులో ఉంటున్నా. పింఛను కోసం నా కొడుకు సాయంతో గూడూరుకు మూడు చక్రాల బండిపై వచ్చా. సచివాలయం సిబ్బంది మా ఇంటికి వచ్చి డబ్బులు అందజేశారు.

ఎంతో సంతోషంగా ఉన్నాం

ఎన్నికలకు ముందు చెప్పినట్లు పింఛన్ల పెంపు హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవేర్చడం స్వాగతించదగ్గ విషయం. అభివృద్ధి, హామీలు అమలు ఆయనకే సాధ్యం. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఒకటో తేదీ ఉద్యోగికి వేతనం వచ్చినట్లు నాకు రూ.7 వేలు పింఛను సొమ్ము అందింది. పింఛను డబ్బులను లెక్కించుకుంటూ ఆనందించా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు.

బాబు వచ్చారు.. భరోసా ఇచ్చారు

చిన్న అయ్యమ్మ, కర్నూలు

ఆర్థిక ఇబ్బందులు తీరేలా సీఎం చంద్రబాబు నాయుడు పింఛను మొత్తాన్ని పెంచారు. సచివాలయ ఉద్యోగి సోమవారం ఇంటి వద్దకే వచ్చి రూ.6 వేలు అందించారు. నేను శారీరక వికలాంగురాలిని.. ఏపని చేతకాకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నా. గతంలో ఇచ్చే రూ.3 వేలు ఏమాత్రం సరిపోయేది కాదు. సీఎం చంద్రబాబు నాయుడు పింఛను సొమ్మును రెట్టింపు చేయడంతో ఆర్థిక భరోసా కలిగింది.

ఆర్థికంగా ఆదుకున్నారు

మంత్రాలయం, న్యూస్‌టుడే : మండల కేంద్రానికి చెందిన కరణం నాగరాజు, కరణం సుమలత కుమార్తె ఇంద్రజ పుట్టుకతోనే మానసిక వైకల్యంతో జన్మించింది. కాళ్లు చేతులు పూర్తిగా పనిచేయకపోవడమే కాక మానసికంగానూ ఎదుగుదల లేకపోవడంతో గతంలో రూ.5 వేల పింఛన్‌ వచ్చేది. నెలనెలా మందులకు పింఛన్‌ డబ్బులేకాక మరో రూ.5 వేలు అప్పులు చేయాల్సి వచ్చేది. దీంతో మా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయిందని తల్లిదండ్రులు నాగరాజు, సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పింఛను మొత్తాన్ని రూ.15 వేలకు పెంచి అండగా నిలవడంతో వారు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

తిండికి ఇబ్బంది ఉండదు

బాలేశ్వరి, బిర్లాగడ్డ

నేను మంచానికే పరిమితమయ్యా. సచివాలయ ఉద్యోగి సోమవారం మా ఇంటికి వచ్చి వేలిముద్ర వేయించుకొని రూ.7 వేలు పింఛను సొమ్ము అందించారు. ఏపని చేతకాని నాకు మందులకు, కుటుంబ పోషణకు ఈ డబ్బు సరిపోతుంది. ఇక ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌ భరోసా పింఛను ఆర్థికంగా ఆదుకుంటుంది. పింఛను మొత్తం పెంచడం ఆనందంగా ఉంది.

ఒంటరి జీవితానికి ఆసరా

అనసూయ, ఆదోని

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: మేము ఆదోని పట్టణంలోని 28వ వార్డులో నివాసం ఉంటున్నాం. ఒంటరి జీవితానికి పింఛను ఆసరాగా నిలుస్తుంది. పింఛను సొమ్ము సరిపోక కూలి పనులకు వెళ్లేదాన్ని. వయస్సు మీద పడటంతో పనులకు పిలిచేవారు సైతం తగ్గిపోయారు. దీంతో జీవనం కష్టమనుకున్న తరుణంలో చంద్రబాబు చలువతో పింఛను పెరిగింది. కష్టాలు తొలగుతాయనే నమ్మకం కలుగుతోంది.

మాలాంటి వారికి అండ

తాయమ్మ, వృద్ధురాలు, ఆలూరు  

నేడు ఓ ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక పనులు చేస్తూ.. ఊడ్చడం, టీలు తెచ్చివ్వడం వంటివి చేస్తుంటా. వారు నెలకు రూ.3 వేలు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే రూ.3 వేలు ఉన్న పింఛనును రూ.4 వేలకు పెంచారు. మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం రూ.7 వేలు ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు ఓ కుమార్తె ఉంది. భర్త చనిపోవడంతో నా వద్దే ఉంటోంది.

మందుల ఖర్చులు తీరుతాయి

ఎమ్మిగనూరు న్యూస్‌టుడే : కళ్లు కనపడకపోవడంతో చిన్న కొడుకు వద్దే ఉంటున్నా. రెండు నెలలుగా పింఛను డబ్బులు సక్రమంగా పంపిణీ చేయలేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడ్డా. సోమవారం ఉదయం 6 గంటలకే సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ డబ్బులు అందించడం సంతోషంగా ఉంది. ఇకనుంచి నా ఆరోగ్య ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరమే లేదు. పింఛను డబ్బులే సరిపోతాయి. మిగిలిన డబ్బులను ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిస్తా.

నరసమ్మ, వృద్ధురాలు

పెంపు ఎంతో ఆదరవు

హనుమక్క, కర్నూలు

చంద్రబాబు ప్రభుత్వం అందించే రూ.4 వేల పింఛను ఎంతో ఆదరవుగా ఉంటుంది. మూడు నెలల బకాయి మొత్తం కలిపి రూ.7 వేలు ఇంటి వద్దే అందించారు. నాలాంటి వారికి పింఛను సొమ్ము ఆసరాగా నిలుస్తుంది. సచివాలయం సిబ్బంది సోమవారం ఉదయమే ఇంటికి వచ్చి నగదు అందించారు. హామీలు కచ్చితంగా అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యమవుతుందని రుజువైంది. పింఛను మొత్తం పెంచడం ఎంతో ఆనందంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని