logo

కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది.

Updated : 02 Jul 2024 05:58 IST

ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రయత్నాలు

ఐదేళ్లు వైకాపా ముఖ్య నేతలతో అంటకాగిన ఉన్నతాధికారులు తమ స్థానాలు పదిలపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖలో పనిచేస్తున్న పలువురు డీఈలు, ఏఈలు ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యారు. కీలకమైన పోస్టులను దక్కించుకునేందుకు కొందరు పోటీ పడుతుండగా.. ప్రస్తుతం ఉన్న స్థానాలను కాపాడుకునేందుకు మరికొందరు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. డోన్, కోవెలకుంట్ల డీఈలు గత ప్రభుత్వంలో చురుగ్గా వ్యవహరించారు. ప్రస్తుతం అదే పోస్టుల్లో ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆర్‌అండ్‌బీ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఆదోని, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌కు చెందిన నలుగురు ఏఈలు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదంగా పనిచేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను కలిసి స్థానభ్రంశం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు.

కీలక స్థానం కోసం

ఉమ్మడి జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధి అండతో గత ఐదేళ్లలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇన్‌ఛార్జిగా కీలక స్థానంలో ఉండి ఆర్‌అండ్‌బీ పనులపై తనదైన ‘ముద్ర’ వేశారు. ప్రస్తుతం ఈ అధికారి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు.

నేషనల్‌ హైవే పదవులకు

నేషనల్‌ హైవేలో ఏడాది పొడవునా పనులు జరుగుతుంటాయి. ఆ విభాగంలో పోస్టింగ్‌ల కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆర్‌అండ్‌బీ ఏఈలు ప్రయత్నాలు చేస్తున్నారు.  మొత్తం ఏడు పోస్టులను దక్కించుకునేందుకు రెండు జిల్లాలకు చెందిన 11 మంది ఏఈలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  కర్నూలులో పోస్టింగ్‌ కోసం మరో ఆరుగురు ఏఈలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆ రెండు డీఈ స్థానాలకు పోటీ

జిల్లా కేంద్రం నంద్యాల డీఈ స్థానం కోసం వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఒక అధికారితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది.

ఆత్మకూరులో ప్రస్తుతం డీఈగా పనిచేస్తున్న అధికారి స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఇప్పటికే ఇద్దరు ప్రజాప్రతినిధులను కలిశారు. డోన్‌ డీఈ పోస్టు కోసం ఇప్పటికే పలువురు అధికారులు ఓ ప్రజాప్రతినిధిని కలిశారు. కర్నూలు ఎస్‌ఈ పోస్టు కోసం జిల్లాకు చెందిన ఒక అధికారితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు పోటీ పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని