logo

కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు.

Updated : 02 Jul 2024 06:01 IST

ఊరూరా పింఛన్‌ పండగ
కర్నూలు సచివాలయం, నంద్యాల పట్టణం న్యూస్‌టుడే

అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా...   ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్‌ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్‌ సొమ్మును జేబులో పెట్టారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన భరోసా లేఖను చేతికిచ్చారు. డబ్బులు అందుకోగానే వారి మోము ఆనందం నిండిపోయింది.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేలు పెంచడమేకాక బకాయిలు ఇవ్వడం సంతోషకరమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

4.35 లక్షల మంది.. రూ.296.64 కోట్ల పంపిణీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,188 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి 50 ఇళ్లను ఓ క్లస్టరుగా మ్యాపింగ్‌ చేసి మండల, గ్రామ, వార్డుస్థాయి అధికారులను నియమించి పింఛన్లు పంపిణీ చేశారు.  కర్నూలులో 92 శాతం, నంద్యాలలో 94.98 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  ప్రతి సచివాలయం నుంచి ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు వంద శాతం పింఛన్లు పంపిణీ చేయడం విశేషం.

మాట నెలబెట్టుకొన్న చంద్రన్న

వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హిజ్రాలు, డప్పు, రంగస్థల కళాకారుల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులు, బహుళ వైకల్యం ఉన్న వారి పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తిస్థాయి దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేలను రూ.15 వేలకు పెంచారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు, డయాలసిస్‌ చేయించుకునే వారు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పింఛను మొత్తాన్ని  రూ.10 వేలకు పెంచి అందజేశారు.

వాలంటీర్ల కంటే మెరుగ్గా..

తమ పాలనలో వాలంటీర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారంటూ వైకాపా ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది. వాలంటీర్లు లేకుంటే పింఛన్లు ఇవ్వడం కష్టమని వైకాపా పాలకులు చెబుతూ వచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం సోమవారం సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టి వాలంటీర్ల కంటే మెరుగ్గా పూర్తి చేశారు.

నడవలేని నాకు పింఛనే ఆధారం

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: రెండు కాళ్లకు ఆపరేషన్‌ చేయించుకొని నడవలేని స్థితిలో ఉన్న నాకు సచివాలయ ఉద్యోగులే ఇంటి వద్దకు వచ్చి పింఛను ఇవ్వడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఉదయమే సిబ్బంది వచ్చి పలకరించి పెరిగిన పింఛను మొత్తాన్ని అందించారు. ఎలా బతకాలి...వైద్యం ఎలా చేయించుకోవాలని అని ఆందోళన చెందుతున్న సమయంలో ఇంటికి వచ్చి డబ్బులివ్వడాన్ని ఆనందం కలిగించింది. ఈ డబ్బులతో చక్కగా వైద్యం చేయించుకుని మళ్లీ నడిచేందుకు ప్రయత్నిస్తా.

పక్కీర్‌ రసూల్‌బీ బీసీ కాలనీ, ఉయ్యాలవాడ

మందుల ఖర్చులకు వస్తాయి.

నాకు 12 ఏళ్ల కిందట పక్షవాతం వచ్చింది. మొదట్లో పాక్షిక వైకల్యం రావడంతో పింఛను ఇచ్చారు. తర్వాత తొలగించారు. మళ్లీ పక్షవాతం వచ్చి నడుము కదలకపోవడంతో మంచానికి పరిమితమయ్యాను. దీంతో మళ్లీ రూ.3 వేల పింఛను పునరుద్ధరించారు. తర్వాత రూ.5 వేలు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు రూ.15 వేలకు పెంచడం చాలా సంతోషంగా ఉంది. ప్రతినెలా రూ.8 వేలకుపైగా మందులకే ఖర్చవుతోంది. గతంలో ఇచ్చిన పింఛను మందులకు కూడా సరిపోయేది కాదు. ఇప్పుడు మందులతో పాటు ఇతర ఖర్చులకు కూడా ఉపయోగపడుతుంది.

గోవర్ధన్, కృష్ణాపురం, ఆత్మకూరు మండలం

పాణ్యం గ్రామీణ : శాంతిరాం వైద్యశాలలో చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మమ్మకు పింఛను మొత్తం అందిస్తున్న సచివాలయ సిబ్బంది పద్మావతి

ఒకేసారి రూ.7 వేలు ఇచ్చారు

బరమల వీరమ్మ, బైర్లూటి గూడెం, ఆత్మకూరు మండలం

చంద్రబాబు ఇంటి వద్దనే పింఛను ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు పింఛను డబ్బులు ఖాతాల్లో వేయడంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఒకేసారి రూ.7 వేలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.

చంద్రబాబు చల్లంగుండాలి

పులిచెర్ల నరసమ్మ, నాగలూటి గూడెం, ఆత్మకూరు మండలం

వయసు మీద పడంలో పనులు చేసుకోలేక ఇబ్బందులు పడేదాన్ని. చంద్రబాబు వృద్ధాప్య పింఛను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. మూడు నెలల బకాయితో కలిపి మొత్తం రూ.7 వేలు అందించడం చాలా ఆనందంగా ఉంది. మందులు, ఇంటికి కిరాణా సరకులు తెచ్చుకుంటాం. వృద్ధులకు అండగా నిలిచిన చంద్రబాబును ధన్యవాదాలు.

రూ.15 వేలు తీసుకున్నా..

నందవరం శ్రీనివాసాచారి, నందికొట్కూరు

నేను పింఛను రూ.75 ఉన్నప్పటి నుంచి తీసుకుంటున్నా. ఈరోజు రూ.15 వేలు తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో నాకు రూ.5 వేలు వచ్చేది. నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లం. తెదేపా ప్రభుత్వం మాకు నెలకు ఏకంగా రూ.15 వేలు ఇవ్వడం హర్షణీయం. సమాజంలో మాకంటూ ఓ గుర్తింపునిచ్చి ప్రోత్సహించడం సంతోషంగా ఉంది.

చంద్రబాబుకు రుణ పడి ఉంటాం

బనగానపల్లి, న్యూస్‌టుడే: దివ్యాంగురాలినైన నాకు గత ప్రభుత్వం ఇచ్చిన రూ.3 వేలు ఎందుకూ సరిపోయేది కాదు. వచ్చిన డబ్బులు చాలీచాలక ఎన్నో అవస్థలపాలయ్యేవాళ్లం.

ఇప్పుడు చంద్రబాబు నెలకు రూ.6 వేలు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంత త్వరగా పింఛనును ఇంత పెద్ద మొత్తంలో పెరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు వల్లే మా జీవితాల్లో వెలుగులు నిండాయి.

సుబ్బలక్ష్మమ్మ దివ్యాంగురాలు, బనగానపల్లి.

భరోసా దక్కింది

షంసూన్, దివ్యాంగురాలు, చాగలమర్రి

చాగలమర్రి, న్యూస్‌టుడే: దివ్యాంగురాలినైన నాకు నలుగురు ఆడపిల్లలే. ఒక కాలు మోకాలి వరకు లేదు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాం. మిగిలిన ఇద్దరితో ఉంటున్నాం. గతంలో ఇచ్చిన మూడు వేలు పింఛనుతో బతకడం కష్టమయ్యేది. పిల్లల్ని ఎలా పోషించాలో అర్థమయ్యేది కాదు. చంద్రబాబు పెంచిన పింఛను రూ.6వేలతో మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కాలు లేక పిల్లలకు ఎలా అండగా ఉండగలననే బాధ నన్ను ఎంతగానో వేధించేది.

మూడింతల సంతోషం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తన కుమార్తెకు గతంలో రూ.5 వేల పింఛనును ఇచ్చేవారు. ఈ మొత్తం దేనికీ సరిపోయేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని ఏకంగా మూడు రెట్లు పెంచి రూ.15వేలు ఇవ్వడం ఆనందం కలిగిస్తోంది. నా భర్త ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. మాకు ముగ్గురు సంతానం. తనూష నరాల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. పాపను ఎల్లప్పుడూ కనిపెట్టుకునే ఉండాలి. భర్త సంపాదనే మాకు ఆధారం.  పెంచిన పింఛను ఎంతో భరోసా ఇచ్చింది.

ప్రవల్లిక, తల్లి, ఆళ్లగడ్డ.

ఇద్దరికీ రూ.22 వేలు వచ్చింది

నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడిని. పొలంలో పనిచేస్తుండగా ఏదో గుచ్చుకుని కాలు సెఫ్టిక్‌ అవడంతో 15 ఏళ్ల కిందట కుడికాలు తొలగించారు. దీంతో ఇంటి వద్దనే ఉండేవాడిని. ఈ క్రమంలో వంటకు అవసరమైన కట్టెలు కొడుతుండగా రెండో కాలుకు గాయమైంది. దీంతో ఆరేళ్ల కిందట దాన్ని కూడా తీసివేశారు. రెండుకాళ్లు పోగొట్టుకుని కదల్లేని స్థితికి చేరుకున్నా. మాకున్న ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాం. వృద్ధాప్యంలో నా భార్య సలారమ్మ ఇంటి వద్దే ఉంటూ నన్ను చూసుకుంటోంది. మేము పింఛనుపై ఆధారపడి జీవిస్తున్నాం.  చంద్రబాబునాయుడు ఒక్కసారిగా రూ.15 వేలు అందించారు.  చాలా ఆనందంగా ఉంది.

చిన్న ఫక్కీర్‌సాహెబ్, కృష్ణాపురం, ఆత్మకూరు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని